తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్, నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి జయలలిత. నాటితరం సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె తర్వాత కాలంలో సైడ్ ఆర్టిస్ట్ గా చేశారు. అలాగే వాంప్ పాత్రలతో ప్రేక్షకుల్లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. సినిమాల్లో ఎక్కువగా వాంప్ క్యారెక్టర్స్ చేసిన జయలలిత ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. 'బంగారు గాజులు', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియల్స్ లో తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


తన జీవితంలో ఎన్నోసార్లు మోసపోయానని ఈ సందర్భంగా పేర్కొన్నారు." సినిమాల్లోకి రాకముందు  నేనొక క్లాసికల్ డ్యాన్సర్‌ని. దేశవ్యాప్తంగా 1000కు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అనుకోకుండా సినిమాల్లోకి ప్రవేశించారు. కుటుంబమంతా నాపైనే ఆధారపడి ఉండడంతో ఎలాంటి పాత్ర వచ్చిన నటించాను. నేను వాంప్ పాత్రల్లో నటించడానికి కారణం కూడా అదే. ఆ తర్వాత  వినోద్ అనే దర్శకుడిని ప్రేమించాను. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకున్నాం. అతను దర్శకత్వం వహించిన ఓ సినిమాలో నాతో అడల్ట్ సీన్ చేశాడు. దాంతో అతడికి దూరంగా ఉండాలనుకున్నా. కానీ అతను పెళ్లికి ఒప్పుకోకుంటే చచ్చిపోతానని బెదిరించడం మొదలుపెట్టాడు. పెళ్లయిన మరుసటి రోజే అతడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత చిత్రహింసలు పెట్టాడు. యాసిడ్ పోస్తానని చెప్పాడు. గదిలో బంధించాడు. సన్నిహితుల సాయంతో ఆ జైలు నుంచి బయటపడ్డాను" అని చెప్పారు.


"నేను కష్టపడి సంపాదించుకున్న రూ.4 కోట్లు ఈమధ్య పోగొట్టుకున్నాను. రాఘవేంద్రరావు దగ్గర అనిల్ గజపతిరాజు డ్రైవర్ గా పని చేసేవాడు. రాఘవేంద్రరావు సీరియల్స్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ ఇంటికి వచ్చి కార్ లో పిక్ చేసుకొని వెళ్లేవాడు. తర్వాత అతను ‘కుందనపు బొమ్మ’ అనే సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ప్లాప్ అవడంతో ఆ నష్టాన్ని పూడ్చేందుకు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అలాగే తన సీరియల్ కోసం కూడా నా దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకున్నాడు. అమ్మ. అమ్మ.. అని అడుక్కోవడంతో ఉన్నదంతా ఇచ్చేసాను. ఆ సమయంలో నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని, అందుకే అలా విసిరేస్తోందని నా వెనకాల చాలామంది తిట్టేవారు. ఇలా ఉన్నదంతా పోయి ఇబ్బందులు పడ్డప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు సపోర్ట్ చేయలేదు" అంటూ తెలిపారు.


"ఒకప్పుడు నేను డాన్సర్ గా ఉన్నప్పుడు మా కూచిపూడి డాన్స్ ప్రోగ్రామ్స్ చూసేందుకు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది వచ్చేవారు. నన్ను చూసి పెళ్లి చేసుకుంటామని ఎంతోమంది మా ఇంటికి వచ్చి చెప్పారు. కానీ మా నాన్న మాత్రం అసలు పడనీయలేదు. అయితే డాన్సర్, లేకపోతే హీరోయిన్. పెళ్లి లేదు ఏం లేదు అని వాళ్ళతో చెప్పి పంపించేసేవారు" అని జయలలిత చెప్పారు. పెళ్లి తర్వాత మళ్ళీ ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అని యాంకర్ అడిగితే, ‘‘అలాంటివి ఏమి రాలేదు. కానీ నన్ను మెయింటైన్ చేస్తాం.. ఉంచుకుంటాం.. అనే ప్రపోజల్స్ తప్పించి పెళ్లి చేసుకుంటామని ఎవరు చెప్పలేదు" అంటూ చెప్పుకొచ్చారు జయలలిత.


Also Read : శ్రీలీలా ఫోబియా - ప్రభాస్ సినిమాలోనూ ఆమే, దర్శకుడు ఎవరంటే?




Join Us on Telegram: https://t.me/abpdesamofficial