తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన అజిత్.. తమిళ నాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే అజీత్ గురించి మీకు తెలియని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.
❤ అజిత్ కుమార్ 1971 మే 1న సికింద్రాబాద్ లో జన్మించారు. ఆయనకు ఒక అన్న తమ్ముడు ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్కూలింగ్ చదివే రోజుల్లో మెకానిక్ కావాలని ఆశ పడిన అజిత్.. ఎన్ఫీల్డ్ కంపెనీలో 6 నెలలు అప్రెంటిస్ గా చేశాడు. తండ్రి ఒత్తిడి మేరకు అది వదిలేసి, గార్మెంట్స్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. కొన్నేళ్లకు తన ఫ్రెండ్స్ తో కలిసి టెక్స్ టైల్ బిజినెస్ స్టార్ట్ చేయడమే కాదు.. మోడలింగ్ అసైన్ మెంట్స్ మీద వర్క్ చేయడం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఓ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కంట్లో పడ్డాడు. అప్పుడే అజిత్ కి యాక్టర్ కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని ఆయన భావించారట.
❤ 1990లో 'ఎన్ వీడు ఎన్ కనవర్' అనే చిత్రంలో చిన్న పాత్ర పోషించిన అజిత్.. 1993లో 'అమరావతి' అనే సినిమాతో ప్రధాన నటుడిగా అరంగేట్రం చేశాడు. అదే ఏడాది గొల్లపూడి శ్రీనివాస్ దర్శకత్వంలో 'ప్రేమ పుస్తకం' చిత్రంతో నేరుగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన 'ప్రేమలేఖ' ఒక కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఉల్లాసం, ప్రియురాలు పిలిచింది, వాలి సినిమాల నుంచి.. విశ్వాసం, వివేకం, తునివు వరకు.. అజిత్ నటించిన అనేక డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
❤ ఒకప్పుడు స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్న అజిత్.. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో నయా ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పటి వరకూ 61 చిత్రాల్లో నటించాడు. తమిళ్ లో అజిత్ నటించిన 'వీరం' సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ 'కాటమ రాయుడు' పేరుతో రీమేక్ చేశాడు. 'వేదాలం' మూవీని మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' గా రీమేక్ చేస్తున్నారు. అంతకముందు రెబల్ స్టార్ ప్రభాస్ 'బిల్లా' చిత్రాన్ని రీమేక్ చేశాడు.
❤ యాక్టింగ్ ఫీల్డ్ లోకి అనుకోకుండా ఎంటరైనప్పటికీ.. స్వయంకృషితో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు అజిత్. ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నాడు. దక్షిణాది చిత్రాలకు ప్రత్యేకంగా అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అలాగే మూడు ఫిలిం ఫేర్ అవార్డ్స్ తో పాటుగా 3 తమిళనాడు స్టేట్ అవార్డ్స్ సాధించాడు.
❤ అజిత్ తన కోస్టార్ శాలినిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. 1999లో అమర్కలం సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడగా.. అదే ఏడాది జూన్ లో షాలినికి అజిత్ ప్రపోజ్ చేశాడు. 2000 ఏప్రిల్ లో పెళ్ళి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఆద్విక్ కుమార్, అనౌష్క అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా వీలయినంత సమయానికి భార్యా పిల్లలకు కేటాయిస్తూ, పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్నాడు. అయితే షాలినిని ప్రేమించక ముందు ప్రేమలేఖ హీరోయిన్ హీరాతో అజిత్ డేటింగ్ చేసినట్లుగా రూమర్స్ ఉన్నాయి.
❤ అజిత్ నటుడే కాదు మంచి రేసర్ కూడా. దేశంలోనే బెస్ట్ బైక్ రేసర్ లలో ఒకరుగా ఆయన గుర్తింపు పొందాడు. గతేడాది వరల్డ్ టూర్ ను ప్రారంభించిన హీరో.. మొదటి దశను పూర్తి చేశాడు. అలానే ఫార్ములా రేసింగ్ లోనూ ఆయన అనేక ఘనతలు సాధించాడు. ప్రతీ సంవత్సరం పలు జాతీయ, అంతర్జాతీయ ఫార్ములా 2 రేసింగ్ పోటీలలో అజిత్ పాల్గొంటాడు.
❤ అజిత్ కుమార్ గన్ ఫైరింగ్ లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. ఇప్పటికే పలు రాష్ట్రస్థాయి షూటింగ్ చాంపియన్ షిప్ లలో చాలా మెడల్స్ గెలుపొందారు. ఇక ఏరో మోడలింగ్ అంటే కూడా అజిత్ కు ఆసక్తి ఉంది. ఆయన పైలెట్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నారు. షూటింగ్ లేని టైంలో అప్పుడప్పుడు స్టూడెంట్స్ కు అజిత్ శిక్షణ కూడా ఇస్తుంటారు. పుస్తకాలు చదవడాన్ని ఇష్టపడే ఆయనకు ఫోటోగ్రఫీ మీద కూడా మక్కువ ఉంది.
❤ సేవా కార్యక్రమాలతోనూ అజిత్ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. సెలబ్రిటీ స్టేటస్ లో ఉండి కూడా, దాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా 'మ్యాన్ ఆఫ్ సింప్లిసిటీ' అనిపించుకున్నాడు. కరోనా సమయంలో తన వంతుగా 1 కోటి 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించి, తన గొప్ప మనసును చాటుకుంటారు. అంతేకాదు తన వద్ద పని చేసే సిబ్బందికి సొంతంగా ఇల్లు కట్టించి రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నాడు.