Komalee Prasad About Telugu Movie Offers: తెలుగు సినిమా పరిశ్రమలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన హీరోయిన్లతో పోల్చితే తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావు అనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఆ విమర్శల్లో ఎలాంటి నిజం లేదంటున్నది అచ్చ తెలుగు అమ్మాయి కోమలీ ప్రసాద్. తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా ‘శశివదనే’ అనే సినిమా తెరకెక్కింది. రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కోమలీ ప్రసాద్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.


టాలీవుడ్ అవకాశాల గురించి కోమలీ కీలక వ్యాఖ్యలు


సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కోమలీ ప్రసాద్ 2016లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘నేను సీతాదేవి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’, ‘నెపోలియన్‌’, ‘సెబాస్టియన్‌ పిసి524’,  ‘రౌడీ బాయ్స్‌’ సినిమాలు చేసినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. ‘హిట్ 2’ మూవీతో ఆమె కు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ‘శశివదనే’ అనే సినిమాలో ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ సందర్భంగా ఆమె తెలుగు సినిమా పరిశ్రమ గురించి మాట్లాడింది. టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదనే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పింది.


తమిళ యాక్టింగ్ ట్రైనర్ మాటలు విని ఆశ్చర్యపోయా!


“నేను తమిళ్ డెబ్యూ చేయబోతున్నాను. చాలా బ్యూటీఫుల్ స్టోరీ. పెద్ద డైరెక్టర్. తమిళంలో మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను. 20 రోజులు నేను వర్క్ షాప్ లో పాల్గొన్నాను. ఉదయం 9 గంటల కల్లా ఆఫీస్ లో ఉండాలి. తమిళం నాకు రాదు. మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్. అక్కడ ఓ యాక్టింగ్ ట్రైనర్ ఉన్నారు. కనీసం ఫోన్ కూడా చూడకూడదు. ఇంటికి వెళ్లే సరికి రాత్రి 10 అవుతుంది. అక్కడ తిరుక్కురల్స్ అని తమిళ్ పోయెమ్స్ ఉన్నాయి. వాటిని నేను నేర్చుకుని, గూగుల్ లో వాటి అర్థాలు తెలుసుకుని పడుకునే సరికి 2 లేదంటే 3 అయ్యేది. మళ్లీ తర్వాతి రోజు సేమ్ రిపీట్. 20 రోజులు ఇదే చేశాను. ఏనాడు హాలీడే తీసుకోలేదు. తమిళం మొత్తం నేర్చుకున్నాను. ఈ పీరియడ్ లో దర్శకుడు, యాక్టింగ్ ట్రైనర్ ఏనాడు పొగడలేదు. వర్క్ షాప్ పూర్తయ్యాక నేను తిరిగి వస్తుంటే.. తెలుగు వాళ్ల డెడికేషన్ ఇలా ఉంటుందని యాక్టింగ్ ట్రైనర్ అన్నారు’’ అని తెలిపింది.


‘‘అదే తెలుగులోకి వచ్చేసరికి, చాలా మంది నన్ను మీరు బాంబే నుంచి వచ్చారు కదా? మీరు అలాగే చెప్పుకోండి, తెలుగమ్మాయని చెప్పకండి అన్నారు. కానీ, ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ నేను తెలుగు అమ్మాయిని అనే కారణంతోనే అవకాశాలు వచ్చాయి. సక్సెస్ కోసం అమ్మపేరు మార్చుకోలేం కదా.. నేను ఎక్కడికెళ్లినా తెలుగు అమ్మాయిగానే చెప్పుకుంటా. నేను తెలుగు అమ్మాయిని అనే కారణంతో అవకాశాలు రావడం లేదని నేను ఏనాడు అనలేదు. ఎందుకు అలాంటి వార్తలు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. తెలుగు అమ్మాయిలు తెలుగు సినిమాల్లో నటించడం వల్ల దర్శకులకు చాలా కన్వీనియెంట్ గా ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.


Read Also: ఛాన్సుల కోసం క్యారెక్టర్‌ను వదులుకోను, ‘పుష్ప-2’ షూటింగులో నన్ను తోసేశారు - దివి