కెరీర్ అనేది ఒక ఫ్లోలో వెళ్లిపోతున్న క్రమంలో కొన్ని ఫ్లాప్స్ ఎదురయినా కూడా నిలదొక్కుకునే నమ్మకం ఏర్పడుతుంది. కానీ కెరీర్ ప్రారంభంలోనే వరుసగా ఫ్లాపులు అంటే.. అటు మేకర్స్, ఇటు ప్రేక్షకులు.. ఇద్దరి దృష్టిలో ఆ నటుడికి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఈరోజుల్లో చాలామంది యంగ్ హీరోలు కెరీర్ మొదట్లోనే వైవిధ్యభరితమైన కథతో యూత్‌ను ఆకట్టుకొని హిట్‌ కొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఆ హిట్ ట్రాక్‌ను కొనసాగించలేక కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఒక యంగ్ హీరో పరిస్థితి కూడా అలాగే ఉంది. అతడు మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు శోభన్ వారసుడు సంతోష్ శోభన్. ఈ యంగ్ హీరోకు వస్తున్న బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు తన కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి.


చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా..
సంతోష్ శోభన్ అనే పేరు చాలామంది ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ తెలిసిన ప్రేక్షకులు మాత్రం చాలావరకు అతడి సినిమాలు బాగుంటాయి, అతడి యాక్టింగ్ బాగుంటుంది అనే చెప్తారు. అలాంటి ఒక మంచి గుర్తింపును సాధించుకున్నాడు ఈ యంగ్ హీరో. కానీ కమర్షియల్‌గా హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. అలా అని తన కెరీర్‌లో అసలు హిట్సే లేవని కాదు. ఆ హిట్స్ అనేవి తనను కనీసం టైర్ 3 హీరోల జాబితాలో కూడా చేర్చలేకపోతున్నాయని అర్థం. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘గోల్కొండ హైస్కూల్’ అనే చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు సంతోష్. ఆ తర్వాత తను హీరోగా మారడానికి పెద్దగా సమయం ఏమీ పట్టలేదు.


బోల్డ్ కంటెంట్‌తో ‘ఏక్ మినీ కథ’..
ఇప్పటివరకు సంతోష్ శోభన్ హీరోగా 9 సినిమాల్లో నటించాడు. అందులో ‘పేపర్ బాయ్’ అనేది కాస్త గుర్తింపును సాధించింది. కలెక్షన్స్ విషయంలో కూడా పరవాలేదనిపించింది. అందుకే ‘పేపర్ బాయ్’ తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా కూడా తనను ఇంకా అదే సినిమాతో గుర్తుపెట్టుకున్నారు చాలామంది ప్రేక్షకులు. ఇక లాక్‌డౌన్ తర్వాత నేరుగా ఓటీటీలో విడుదలయిన ‘ఏక్ మినీ కథ’ అయితే సంతోష్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారుతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆ మూవీకి వచ్చిన రెస్పాన్స్ అలాంటిది. వైవిధ్యభరితమైన కథ మాత్రమే కాదు.. అసలు అలాంటి బోల్డ్ సినిమాను సంతోష్ ఎలా ఎంపిక చేసుకున్నాడు అనే అంశం కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. కానీ ‘ఏక్ మినీ కథ’ తర్వాత అదే హిట్ ట్రాక్‌ను సంతోష్ కొనసాగించలేకపోయాడు.


ప్రేక్షకులు పట్టించుకోని ‘ప్రేమ్ కుమార్’..
2023లో ఇప్పటికే నాలుగు సినిమాలు విడుదల చేశాడు సంతోష్ శోభన్. అందులో అన్నీ పరవాలేదు అనిపించేలా ఉన్నాయే తప్పా.. ఎక్స్‌ట్రార్డినరీగా మాత్రం ఏదీ లేదు. తాజాగా విడుదలయిన ‘ప్రేమ్ కుమార్’ కూడా ఫ్లాప్‌నే మూటగట్టుకుంది. రీ రిలీజ్ సినిమాలు ఎక్కువవ్వడం, ‘ప్రేమ్ కుమార్’కు పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడంతో అసలు ఇలాంటి సినిమా ఒకటి ఉంది అని ప్రేక్షకులకు తెలియకుండా పోయింది. వైవిధ్యభరితంగా, కామెడీ పండించే కథలనే సంతోష్ శోభన్ ఎంచుకుంటున్నా కూడా వాటిని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లే సమయానికి సినిమాల్లో చాలా పొరపాట్లు ఉంటున్నాయని, అందుకే ఇప్పటినుండి స్క్రిప్ట్స్ విషయంలో, సినిమాల ఔట్‌పుట్ విషయంలో సంతోష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇండస్ట్రీ నిపుణులు సలహా ఇస్తున్నారు.


Also Read: గుండులో సల్మాన్ ఖాన్ కొత్త లుక్ - ఆ మూవీ సీక్వెల్ కోసమే అంటున్న ఫ్యాన్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial