క్రికెట్ నేపథ్యంలో బాలీవుడ్ లో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా ‘ఘామర్’ అనే మరో సినిమా రూపొందింది. అభిషేక్ బచ్చన్, సయామీ ఖేర్ కలిసి నటించారు. ఈ సినిమా ఓ స్పిన్ బౌలర్ చుట్టూ తిరుగుతుంది. కుడి చేయి కోల్పోయిన ఓ అమ్మాయి  లెఫ్టామ్ స్పిన్నర్ గా ఎలా ఎదిగింది? అనేది ఈ మూవీలో అద్భుతంగా చూపించారు దర్శకుడు ఆర్ బాల్కీ. చేయి లేని క్రికెటర్ పాత్రలో సయామీ ఖేర్ కనిపించగా, ఆమె కోచ్ గా అభిషేక్ నటించారు. ఆగష్టు 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ అతిథి పాత్రలో నటించారు.


సచిన్ దగ్గర బౌలింగ్ మెళకువలు నేర్చుకున్న సయామీ


తాజాగా ఘామర్’ సినిమా ప్రమోషన్ లో భాగంగా సయామీ ఖేర్ ప్రపంచ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను కలిసింది. కాసేపు ఆయనతో సరదాగా క్రికెట్ మెళకువలు నేర్చుకుంటూ కనిపించింది. ఈ సందర్భంగా ఇద్దరూ క్రికెట్ గురించి పలు విషయాలు చర్చించుకున్నారు. బౌలింగ్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా బౌలింగ్ చేస్తే రన్స్ రాకుండా చేయవచ్చు, వికెట్లు తీయాలంటే ఏం చేయాలి? అనే విషయాలను సచిన్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేసింది సయామీ. ఈ సందర్భంగా లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసి సచిన్ ను ఆకట్టుకుంది. ఆమె బౌలింగ్ తీరుపై సచిన్ ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా చేశావంటూ అభినందించారు.  ఇక  సచిన్ గురించి సయామీ ఆసక్తికర విషయాలు చెప్పింది. “ఏదో ఒకరోజు నా దృష్టిలో హీరో, నా స్ఫూర్తి, నా టీచర్ గా భావించే సచిన్ ను కలుస్తాను అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. అతడి ఆట తీరు చూసి నేను ఎంతో ఇష్టంగా  క్రికెట్ నేర్చుకున్నాను. ఇవాళ అతడిని కలిశాను” అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సచిన్ తో బౌలింగ్ టిప్స్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో సచిన్, సయామీని ఎడమ చేతితో బౌలింగ్ చేయమని చెప్పారు. ఆమె అద్భుతంగా బౌలింగ్ చేయడంతో అభినందించారు.






తెలుగు మూవీతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ


ఇక బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.  2015లో ‘రేయ్’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ మరాఠీ బ్యూటీ. ఆ తర్వాత బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.  ఆ తర్వాత ‘వైల్డ్ డాగ్’, ‘హైవే’ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. తన కెరీర్ మొదట్లో ఆమె పలు అవమానాలను ఎదుర్కొన్నట్లు వివరించింది. కొంత మంది బాడీ షేమింగ్ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తన ముక్కు గురించి, పెదాల గురించి అవమానకరంగా మాట్లాడరని చెప్పుకొచ్చింది. కానీ, తన గురించి చెడుగా మాట్లాడే వారిని ఎప్పుడూ పట్టించుకోలేదని చెప్పింది.  ఫోకస్ అంతా నటన మీదే పెట్టినట్లు వివరించింది.


Read Also: 'యశోద' నిర్మాత చేతికి '800' - ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial