మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా నటించిన సినిమా 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki Movie). హీరోగా నటించడమే కాదు... ఈ చిత్రానికి విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. నిర్మాతగానూ వ్యవహరించారు. తెలుగులో మాత్రమే కాదు... తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రమిది.
అప్పుడు బాబాయ్ బాలకృష్ణ...
'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ విడుదల కార్యక్రమానికి గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ వేడుకకు బాలకృష్ణ రావడం వల్ల సినిమాకు బజ్ వచ్చింది. ఆయన హుషారుగా మాట్లాడటం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు అబ్బాయ్ జూనియర్ ఎన్టీఆర్...
మార్చి 17న... వచ్చే శుక్రవారం 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, శిల్పకళా వేదికలో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున జరగనున్న ఆ వేడుకకు మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR Jr) ముఖ్య అతిథిగా రానున్నారు. ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ తర్వాత ఇండియాలో ఆయన హాజరు కానున్న కార్యక్రమం ఇదే. దాంతో 'దాస్ కా ధమ్కీ'కి విపరీతమైన బజ్ వస్తుందని చెప్పవచ్చు.
విశ్వక్... ఎన్టీఆర్ వీరాభిమాని!
జూనియర్ ఎన్టీ రామారావుకు విశ్వక్ సేన్ వీరాభిమాని. గతంలో పలుమార్లు ఆ విషయాన్ని చెప్పారు. ఒకసారి ఎన్టీఆర్ పుట్టినరోజుకు స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు. 'పాగల్' సినిమాలో తన లుక్ 'ఊసరవెల్లి' సినిమాలో ఎన్టీఆర్ లుక్ తరహాలో ఉందని అభిమానులు చెబితే సంబరపడ్డారు. తన సినిమా వేడుకకు అభిమాన కథానాయకుడు ముఖ్య అతిథిగా రావడం కంటే హ్యాపీ మూమెంట్ విశ్వక్ సేన్ కు ఏం ఉంటుంది?
'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి వెళ్లి వచ్చిన తర్వాత బాలకృష్ణకు కూడా విశ్వక్ సేన్ దగ్గర అయ్యారు. 'వీర సింహా రెడ్డి' సక్సెస్ తర్వాత సినిమా యూనిట్ చేసుకున్న పార్టీకి ఆయనకు ఆహ్వానం అందింది. బాలకృష్ణతో కలిసి ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా!
విశ్వక్ సేన్ జోడిగా నివేదా పేతురాజ్!'దాస్ కా ధమ్కీ' సినిమాలో విశ్వక్ సేన్ జోడీగా నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) నటించారు. వాళ్ళిద్దరి కలయికలో రెండో చిత్రమిది. 'పాగల్' సినిమాలోనూ ఆమె నటించారు. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.
Also Read : వెయ్యి కోట్ల సినిమాకు అయినా సరే 'ఆమె' కావాలి - ఆడదే ఆధారం
ఇప్పటి వరకూ విడుదలైన 'దాస్ కా ధమ్కీ' ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అట్ట్రాక్ట్ చేశాయి. 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల...', 'మావా బ్రో...', 'ఓ డాలరు పిలగా...' పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై విశ్వక్ సేన్ తండ్రి 'కరాటే' రాజు నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. 'ధమాకా' తర్వాత ఆయన సంభాషణలు రాసిన చిత్రమిది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : దినేష్ కె బాబు, సంగీతం : లియోన్ జేమ్స్, ఎడిటర్ : అన్వర్ అలీ, కళా దర్శకత్వం : ఎ. రామాంజనేయులు, ఫైట్స్ : టోడర్ లాజరోవ్ -జుజి, దినేష్ కె బాబు, వెంకట్.
Also Read : వెంకటేష్ మహా ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఆయనకు అసలు పాయింట్ అర్థమవుతోందా?