శ్రీకాంత్ వారసుడు రోషన్ మేక.. ‘పెళ్లి సందD’ మూవీ తర్వాత మళ్లీ కనిపించలేదు. ఆ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కొట్టకపోవడంతో రోషన్ కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా బడా బ్యానర్‌లో ఛాన్స్ కొట్టేశాడు. వైజయంతి మూవీస్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్న మూవీలో రోషన్ హీరోగా నటించనున్నాడు. ఈ మూవీకి ‘ఛాంపియన్’గా టైటిల్ ఖరారు చేశారు. ‘అద్వైతం’ షార్ట్ ఫిల్మ్‌‌తో జాతీయ అవార్డును గెలుచుకున్న ప్రదీప్ అద్వైతం ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది యాక్షన్, పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలిసింది. ఈ మూవీలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు.


సోమవారం (13.03.2023) రోషన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ మూవీస్ ఫస్ట్ లుక్‌తోపాటు టైటిల్ రివీల్ చేసింది. రోషన్ మరో మూవీకి కూడా సైన్ చేశాడు. వేదాంస్ పిక్చర్స్ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న మూవీలో నటించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా అప్‌డేట్స్ కూడా ప్రకటించనున్నారు. ఈ మూవీస్ రెండూ ఏప్రిల్, మే నెలల్లో షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిసింది. ‘ఛాంపియన్’ మూవీ తెలంగాణ రజాకార్ల ఉద్యమం ఆధారంగా నడుస్తుందని సమాచారం.






శ్రీకాంత్ వారసుడిగా వెండితెరపైకి వచ్చిన రోషన్‌కు టాలీవుడ్‌లో నిలదొక్కుకోడానికి సక్సెస్ చాలా అవసరం. 2015లో వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమాలో రోషన్  బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత రోషన్ హీరోగా ‘నిర్మలా కాన్వెంట్’ (2016) స్కూల్ మూవీలో నటించాడు. ఈ మూవీకి ఉత్తమ నటుడిగా SIIMA అవార్డును గెలుచుకున్నాడు. తర్వాత రోషన్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పెళ్లి సందD’లో హీరోగా నటించాడు. రోషన్‌కు జోడీగా శ్రీలీలా నటించింది. ఈ మూవీలోని పాటలు, డ్యాన్సులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ, ఈ మూవీ ఆశించిన విజయం సాధించలేదు. రోషన్ నటనలో ప్రవేశించడానికి ముందు  నటనలో శిక్షణ పొందింది. బాలీవుడ్‌లో కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ‘సీతారామం’ మూవీతో ఇప్పటికే వైజయంతి మూవీస్ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అలాగే ఈ బ్యానర్ వచ్చే సినిమాలు కుటుంబ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోషన్ ‘ఛాంపియన్’ మూవీపై అంచనాలు నెలకొన్నాయి.