వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తన కొత్త సినిమాను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తన కొత్త సినిమాకి 'వ్యూహం' అనే టైటిల్ ని ఖరారు చేశారు వర్మ. ఇక ఈ మూవీ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నానని ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ ప్రాజెక్ట్ పై పడింది. "నేను అతి త్వరలో 'వ్యూహం' అనే ఓ రాజకీయ సినిమాను తీయబోతున్నాను. ఇది బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయోపిక్ లో అయినా అబద్ధాలు ఉండొచ్చు. కానీ రియల్ పిక్ లో నూటికి నూరుపాలు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రల విషయంతో నిండి ఉంటుంది" అంటూ తన కొత్త సినిమా గురించి పలు హింట్స్ ఇచ్చాడు రాంగోపాల్ వర్మ. అంతే కాదు ఈ సినిమాను తాను రెండు భాగాలుగా తీయబోతున్నానని మొదటి భాగానికి 'వ్యూహం' అని రెండో భాగానికి 'శపథం' అనే టైటిల్స్ ని పెట్టినట్లు పేర్కొన్నాడు.


ఈ రెండు భాగాల్లో రాజకీయ అరాచకాలు పుష్కలంగా ఉంటాయని అన్నాడు. రాష్ట్ర ప్రజలు మొదటి భాగం 'వ్యూహం' షాక్ నుంచి తేరుకునే లోపే వాళ్ళకి రెండో భాగం 'శపథం' తో మరో షాక్ ఇస్తానని అన్నాడు వర్మ. ఇక ఈ సినిమాని గతంలో రాంగోపాల్ వర్మతో 'వంగవీటి’ సినిమాని తీసిన దాసరి కిరణ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు రాంగోపాల్ వర్మ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తున్నట్లు పేర్కొన్నాడు వర్మ. అలాగే ఆయన భార్య వైయస్ భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు తెలుపుతూ ఈ మేరకు కొన్ని పోస్టర్స్ ని  తన ట్విట్టర్లో షేర్ చేశారు వర్మ.


ఇక ఈమధ్య ఎక్కువగా రాజకీయాలపైనే సినిమాల తీస్తున్న రాంగోపాల్ వర్మ ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణాన్ని ఆధారంగా తీసుకొని ‘వ్యూహం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల ఆధారంగా రూపొందుతున్న ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాంగోపాల్ వర్మ ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతుల జీవిత కథ ఆధారంగా 'కొండా' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఆడియన్స్ లో ఆ సినిమా కనీస ఆదరణను కూడా దక్కించుకోలేకపోయింది. ప్రమోషన్స్ అయితే ఓ రేంజ్ లో చేశారు కానీ సినిమా మాత్రం ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయలేదు. మరి తాజాగా తెరకెక్కిస్తున్న 'వ్యూహం' సినిమాతో రామ్ గోపాల్ వర్మ ఆడియన్స్ లో ఎలాంటి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాడో చూడాలి.