Ram Charan Team Up With Sujeeth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తి కాగా మిగిలిన భాగం చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు డైరెక్షన్‌లో 'పెద్ది'పై భారీ హైప్ నెలకొనగా.. తర్వాత ఏ డైరెక్టర్‌తో చేస్తారోననే చర్చ సాగుతోంది.

సుకుమార్‌తో ప్రాజెక్ట్ ఆలస్యం?

'పుష్ప 2'తో పాన్ ఇండియా లెవల్‌లో భారీ హిట్ సాధించిన సుకుమార్‌తో (Sukumar) రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన వచ్చింది. రెండు రోజుల క్రితమే డైరెక్టర్ సుకుమార్ కూడా దీనిపై స్పందించారు. ఈ సినిమా 'రంగస్థలం' మూవీని మించిపోతుందని.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. అయితే, ఈ సినిమా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. దీంతో చరణ్ ఈక్వెల్‌గా వేరే ప్రాజెక్టును మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే 'యూవీ క్రియేషన్స్' ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేయాలని చరణ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. అందుకు తగ్గట్లుగానే అనిల్ అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ ఆయనకు బాగా నచ్చిందట. అయితే, అది భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది.

'ఓజీ' డైరెక్టర్‌తో..

'పెద్ది' తర్వాత ఆలస్యం కాకుండా 'ఓజీ' దర్శకుడు సుజీత్‌తో ఓ సినిమా చేయాలని చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. చరణ్ ఇమేజ్, ఫ్యాన్ బేస్‌కు తగ్గట్లు అతని వద్ద ఓ యాక్షన్ స్క్రిప్ట్ ఉందని సమాచారం. అయితే.. ఓజీ రిజల్ట్‌ను బట్టి ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.

Also Read: 'నాయకుడు' కంటే 'థగ్ లైఫ్' భారీ హిట్ అవుతుంది... ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు కమల్ హాసన్ ప్రామిస్

చెప్పిన టైంకే 'పెద్ది'

మరోవైపు.. బుచ్చిబాబు 'పెద్ది' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీనికి సంబంధించి గురువారం కీలక అప్‌డేట్ ఇచ్చారు. చరణ్ - బాలీవుడ్ యాక్టర్ దివ్యేందు శర్మలపై యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్ షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. వారిద్దరితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్‌లో స్పోర్ట్స్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కనుండగా.. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

'ఓజీ' సెట్‌లో పవన్

అటు.. పవన్ కల్యాణ్ సైతం ఇటీవలే 'ఓజీ' షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టారు. దాదాపు 3 వారాల పాటు పవన్ సహా ఇతర యాక్టర్స్‌పై కీలక సీన్స్ షూట్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ సుజీత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ మూవీ రిజల్ట్‌పైనే చరణ్ ప్రాజెక్టు కూడా ఆధారపడి ఉందనే టాక్ వినిపిస్తోంది.