Ram Charan to visit Kadapa Dargah: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్‘ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే ఏడాది (2025) జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రామ్ చరణ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ టైమ్ లో ఆయన కడపకు వెళ్లబోతున్నారు. ఇంతకీ ఆయన అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే...
ముషాయిరా గజల్ వేడుకల్లో పాల్గొననున్న చెర్రీ
దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కడప దర్గాలో ఈ నెల 18న 80వ జాతీయ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు గజల్ గాయకులు పాల్గొననున్నారు. ఈ వేడుకకు రామ్ చరణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన.. పనిలో పనిగా కడప దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రామ్ చరణ్ దర్గాకు వస్తున్న నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భక్తలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. దీక్షలో ఉండగానే ఈ వేడుకలో పాల్గొంటారా? లేదంటే, అప్పటిలోగా దీక్ష పూర్తి అవుతుందా? అనేది తెలియాల్సి ఉంటుంది. కడపలోని అమీన్ పీర్ దర్గాకు మంచి గుర్తింపు ఉంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నందమూరి కల్యాణ్ రామ్, పవన్ కల్యాణ్ లాంటి సినీ నటులు తరచుగా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. తాజాగా ఈ లిస్టులో చెర్రీ కూడా చేరబోతున్నారు.
Read Also:మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
‘గేమ్ ఛేంజర్’పై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఇటీవల రిలీజైన టీజర్ సినీ అభిమానులలో భారీగా అంచనాలు పెంచింది. ఈ చిత్రంలో తెలుగమ్మాయి అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు కథను అందిచగా, సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించారు. దిల్ రాజు ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
త్వరలో RC16 షూటింగ్ ప్రారంభం
ఓవైపు ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో మరోవైపు ‘RC16’ మూవీ షూటింగ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన తొలి షెడ్యూల్ అప్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.