Rajendra Prasad Comments On Brahmanandam: అడుసు తొక్కనేల కాలు కడగనేల - అని తెలుగులో ఓ సామెత ఉంది. నట కిరీటి, డాక్టరేట్ హోల్డర్, సీనియర్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ వ్యవహార శైలి చూస్తుంటే తెలుగు చిత్రసీమలో కొంత మందికి ఆ సామెత గుర్తుకు వస్తోంది. అడుసు తొక్కిన తర్వాత కాలు కడగకుండా తన కాలు శుభ్రంగా ఉందని చెబితే నమ్మడం ఎంత కష్టంగా ఉంటుందో... రాజేంద్రుడు నోరు జారి సమర్ధించుకోవడం కూడా ఆ చందంగా ఉంది.
మళ్ళీ నోరు జారిన రాజేంద్రుడు!'రాబిన్ హుడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తు ఉందా? ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ మీద నోరు పారేసుకున్నారు రాజేంద్ర ప్రసాద్. ఆయన మాటలకు అందరూ నోరెళ్లబెట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో ప్రముఖ నటుడు అలీని అనకూడని మాట అన్నారు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ తీరును ఎండ కడుతూ చాలా మంది విమర్శలు చేశారు. అయితే తనను తాను రాజేంద్రుడు సమర్ధించుకున్నారు. ఆ వివాదాలు మరువక ముందు మరోసారి నటకిరీటి నోరు జారారు.
'సకుటుంబానాం'... సినిమా పేరు ఎంత చక్కగా, సంప్రదాయబద్దంగా ఉందో కదూ! టైటిల్‌కు తగ్గట్టు చక్కటి కుటుంబ కథా చిత్రాన్ని తీశారు. హీరో రామ్ కిరణ్ దమ్ము కొట్టినట్టు, మందు తగినట్టు చూపించినా... ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా అని అర్థం అవుతోంది. మానవ సంబంధాలు, అనుబంధాలు, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా తీశారని తెలుస్తోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కూడా నటించారు. ట్రైలర్ చివరలో ఎమోషనల్ డైలాగ్ చెప్పారు రాజేంద్ర ప్రసాద్. అయితే ట్రైలర్ విడుదల కార్యక్రమంలో మాత్రం నోరు జారారు.
చూశారుగా... 'సకుటుంబానాం' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో స్టేజిపై 'ముసలి ముం... కొడకా' అంటూ బ్రహ్మానందం మీద నోరు జారారు రాజేంద్ర ప్రసాద్. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేంద్రుడి తీరు బ్రహ్మి నొచ్చుకున్నట్టు వీడియోలు చూస్తుంటే అర్థం అవుతోంది. గతంలో నోరు జారిన తర్వాత తన ప్రవర్తన, వ్యవహార శైలిని సమర్ధించుకున్నట్టు ఈసారి కూడా రాజేంద్రప్రసాద్ సమర్ధించుకుంటారేమో చూడాలి. నలుగురిలో మాట్లాడుతున్న సమయంలో, అందులోనూ ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న తరుణంలో ఈ విధంగా మాట్లాడటం ఆయన వయసుకు సరి కాదని, గౌరవం తగ్గుతుందని గుర్తిస్తే మంచిది.