Raj Tarun: టాలీవుడ్ యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ కూడా ఒకడు. మినిమమ్ గ్యారెంటీ హీరో అయ్యే లక్షణాలు ఉన్నా కూడా తను నటించిన చిత్రాలు చాలావరకు ఆశించిన విజయం సాధించకపోవడంతో ప్రస్తుతం ఒక్క హిట్ కోసం, కమ్ బ్యాక్ కోసం కష్టపడుతున్నాడు రాజ్ తరుణ్. త్వరలోనే ‘భలే ఉన్నాడే’ అనే రిఫ్రెషింగ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సందర్భంగా తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక్కసారిగా తన కెరీర్‌ను మొత్తం రివైండ్ చేసుకొని ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.


థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు..


‘‘నా సినిమా ఆడలేదు అన్నదానికంటే థియేటర్లలో విడుదల కాలేదు అన్న విషయానికి నేను ఎక్కువగా బాధపడ్డాను. అదే ఒరేయ్ బుజ్జిగాడు. ఆ సినిమా థియేటర్లలో విడుదలయితే అదిరిపోతుంది అనుకున్నాను కానీ మార్చి 25 మూవీ రిలీజ్ అంటే మార్చి 23న లాక్‌డౌన్ ప్రకటించారు. చాలా ఎదురుచూసిన తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను’’ అంటూ ‘ఒరేజ్ బుజ్జిగాడు’ ఓటీటీ రిలీజ్‌ను గుర్తుచేసుకొని ఫీల్ అయ్యాడు రాజ్ తరుణ్. ఇక తను స్క్రిప్ట్ లెవెల్ నుండే చాలా నమ్మకంతో ఉండి, థియేటర్లలో విడుదలయ్యే సమయానికి యావరేజ్‌గా నిలిచిన చిత్రం మాత్రం ‘అంధగాడు’ అని బయటపెట్టాడు. అది బ్లాక్ బస్టర్ అవుతుందని తాను నమ్మానని, కానీ అలా జరగలేదని ఫీలయ్యాడు.


దానివల్లే మూవీ ఫ్లాప్..


‘ఇద్దరి లోకం ఒక్కటే’ లాంటి డిఫరెంట్ ప్రేమకథతో తన కెరీర్‌లో కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు రాజ్ తరుణ్. తనకు కథ చాలా నచ్చిందని, ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకున్నానని చెప్పుకొచ్చాడు. ‘‘తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి అందులో చేసిన చిన్న చిన్న మార్పుల వల్ల దాని కథ దెబ్బతిన్నది’’ అని ఆ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణాన్ని తెలిపాడు. తనకు తాను బెస్ట్ పర్ఫెర్మెన్స్ ఇచ్చిన సినిమాల గురించి అడగగా ‘కుమారి 21 ఎఫ్’ అన్నాడు రాజ్ తరుణ్. ఇక ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను గుర్తుచేసుకుంటూ ‘‘నేను పనిచేసిన బెస్ట్ దర్శకుల్లో ప్రతాప్ ఒకరు. టైటిల్ కూడా సుకుమార్ ఐడియానే’’ అని చెప్పుకొచ్చాడు.


ఒక్కరోజు కూడా కోప్పడలేదు..


ప్రతీ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే ముందు దర్శకులతో ఫ్రెండ్‌షిప్ చేసుకోవడం తనకు అలవాటు అని బయటపెట్టాడు. కొందరితో అలా ఫ్రెండ్‌షిప్ కుదరలేదు అని కూడా అన్నాడు. అలా కుదరని దర్శకులు ఎవరు అని అడగగా.. ‘‘మీకు చెప్పడం పాపం అయిపోతుంది. ఎందుకలా దొబ్బుతారు’’ అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. తన అప్‌కమింగ్ మూవీ ‘తిరగబడరా సామి’ గురించి చెప్తూ.. ‘‘డైరెక్టర్ రవికుమార్ చౌదరీ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా అంతా అయిపోయింది కానీ నా మీద ఒక్కరోజు కూడా కోప్పడలేదు. నేనంటే విపరీతమైన ప్రేమ. నాకు కూడా ఆయనంటే అంతే ఇష్టం’’ అని తెలిపాడు రాజ్ తరుణ్.



Also Read: సోనాక్షి సిన్హా‌తో బెడ్ సీన్.. ఆమె తల్లి ముందే అలా చెయ్యాల్సి వచ్చింది: ‘హీరామండి’ నటుడు ఇంద్రేష్