'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా (The Girlfriend Movie) మీద సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రదర్శన తరువాత ఓ అమ్మాయి రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran)తో సంతోషాన్ని పంచుకుంది. ఈ చిత్రాన్ని చూసిన తరువాత తనకు కూడా ధైర్యంగా చున్నీ తీసేసి తన అభిప్రాయాల్ని చెప్పాలని ఉందని అంటూ... చున్నీని తీసి పడేసింది. ఇక ఈ వీడియో నెట్టింట్లో తెగ ట్రోలింగ్ అయింది. ఆ అమ్మాయి ఎప్పుడూ చున్నీ వేసుకున్నట్టు బిల్డప్ ఇస్తోందని... అసలు ఆమె ఇన్ స్టా రీల్ చూస్తే అసలు విషయం తెలుస్తుందని, సినిమా కోసమే అలా వేసుకుని వచ్చిందని, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని, పీఆర్ స్టంట్ అని నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే.
పీఆర్ స్టంట్ కాదు... ఖండించిన రాహుల్!సదరు అమ్మాయి మీద సోషల్ మీడియాలో జరుగుతున్న దాన్ని రాహుల్ రవీంద్రన్ ఖండించాడు. ఈ మేరకు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ... ''అసలు ఈ విషయం మీద నేను స్పందించకూడదని అనుకున్నాను. కానీ ఈ ట్రోలింగ్ మరీ శృతి మించిపోతోంది. ఆ అమ్మాయిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు. అసలు ఆ రోజు ఏ థియేటర్‌కి ఎక్కడికి వెళ్తాం. థియేటర్లో ఎవరు ఉంటారు? అన్నది మాకు ఐడియా లేదు... అదంతా పీఆర్ స్టంట్ కాదు... ఆ అమ్మాయి సినిమా చూసి వచ్చి తన అభిప్రాయాన్ని చెప్పింది.
Also Read: 'కాంత' రివ్యూ: దుల్కర్ vs సముద్రఖని... మధ్యలో భాగ్యశ్రీ, రానా - మహానటి రేంజ్‌లో ఉందా?
ఆ తరువాత వెంటనే మేం మళ్లీ వేరే థియేటర్‌కు వెళ్లాం. ఆ అమ్మాయికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఆ వీడియో పోస్ట్ చేసుకోవచ్చని మా టీం నాతో చెప్పింది. అసలు ఈ సినిమా చున్నీ వేసుకోమని గానీ వేసుకోవద్దని గానీ చెప్పడానికి తీయలేదు.. వేసుకోవాలా? వద్దా? అన్నది వ్యక్తిగత అభిప్రాయం.. ఈ ఘటన మన అందరినీ మరోసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెబుతుంది.. ఓ అమ్మాయి తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో సింబాలిక్‌గా చున్నీ తీసేస్తే కొందరు మాత్రం తట్టుకోలేకపోతోన్నారు..
సినిమాల్లో హీరోలు ఫైట్ చేసే ముందు గుండీలు తీస్తారు.. ఆట గెలిస్తేనో.. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లోనూ మగాళ్లు చొక్కాలు విప్పేస్తారు.. అవేవీ మీకు తప్పులుగా కనిపించవా?.. కానీ కల్చర్, సంప్రదాయం అని మహిళల మీదే ఎందుకు రుద్దుతారు.. మనలో ఎంత మంది నిత్యం ధోతిలను ధరిస్తారు? ఎందుకు ప్యాంట్లు వేసుకుంటున్నాం?.. మన భాష మీద అంత ప్రేమ ఉండే వాళ్లంతా ఇంగ్లీష్‌లో ఎందుకు ట్వీట్లు వేస్తున్నారు?.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఉందా?.. ది గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమా ఇప్పటి ట్రెండ్, ఇప్పటి తరానికి అవసరం అని చాలా మంది నాతో అన్నారు.. అది ఎందుకో వీరి రియాక్షన్ చూస్తుంటేనే అర్థం అవుతోంది'' అని ట్వీట్ వేశారు.
Also Read: కార్తీక దీపం సీరియల్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా - అనౌన్స్ చేశారు కానీ...