Pushpa 2 First Weekend Collection: అల్లు అర్జున్ హీరోగా నటించిన సెన్సేషనల్ సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. నాలుగు రోజుల మొదటి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.829 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటి వీకెండ్‌లో ఒక సినిమా ఇంత వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు ఈ రికార్డు ‘బాహుబలి 2’ పేరిట ఉండేది. ‘బాహుబలి 2’ మొదటి వీకెండ్‌లో రూ.625 కోట్ల వసూళ్లు సాధించింది.
మొదటి రోజు నుంచి మొదలైన సునామీ...
‘పుష్ప 2’ సినిమా మొదటి రోజు రూ.294 కోట్లు వసూళ్లు చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. దీనికి ముందు ఈ రికార్డు ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉండేది. ‘ఆర్ఆర్ఆర్’ మొదటి రోజు మనదేశంలో రూ.223 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డును ఏకంగా రూ.71 కోట్ల మార్జిన్‌తో ‘పుష్ప 2’ దాటేయడం విశేషం. అలాగే నాలుగో రోజు ఈ సినిమా రూ.208 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మొదటి రోజు కాకుండా మరే భారతీయ సినిమా ఇప్పటి వరకు రూ.200 కోట్ల వసూళ్లు దాటలేదు. ‘పుష్ప 2’ నాలుగో రోజు కూడా ఈ ఫీట్‌ను సాధించడం విశేషం.
Also Read : అల్లు అర్జున్‌కి అమితాబ్ బచ్చన్ అభిమాని అట.. ఏవండోయ్ ఇది చూశారా?
హిందీలో షారుక్ రికార్డులు అవుట్...
మరోవైపు అల్లు అర్జున్ హిందీలో షారుక్ ఖాన్ రికార్డులు కూడా ఊచకోత కోయడం మొదలెట్టాడు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమా కూడా హిందీలో ఒక్క రోజులో రూ.70 కోట్ల నెట్ మార్కును దాటలేదు. కానీ ‘పుష్ప 2’ మొదటి రోజు రూ.72 కోట్లు వసూళ్లను సాధించింది. మూడో రోజు రూ.74 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక నాలుగో రోజు ఏకంగా అందరినీ మైండ్ బ్లాక్ చేస్తూ రూ.86 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సింగిల్ డేలో హయ్యస్ట్ కలెక్షన్లలో టాప్-3 స్థానాలు అల్లు అర్జున్ దగ్గరే ఉన్నాయి.
మొదటి నాలుగో రోజుల్లోనే ‘బాహుబలి 2’ (రూ.510 కోట్లు), ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ (రూ.435 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ.294 కోట్లు) తప్ప మిగతా అన్ని సౌత్ ఇండియన్ సినిమాల వసూళ్లను ‘పుష్ప 2’ దాటేసి రూ.291 కోట్ల నెట్‌ను సాధించింది. హిందీలో మొదటి సోమవారం కలెక్షన్ల పరంగా చాలా ముఖ్యమైన రోజు. ఆరోజు నిలబడితే ఆ సినిమాకు లాంగ్ రన్ ఉందని అందరూ నమ్ముతారు. మొదటి సోమవారం కూడా రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో రూ.50 కోట్లకు పైగా నెట్‌ను ‘పుష్ప 2’ కలెక్ట్ చేయనుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బ్రాండ్ ‘పుష్ప’దా... ‘బన్నీ’దా...
‘పుష్ప’ సిరీస్‌తో అల్లు అర్జున్ బాలీవుడ్‌లో పెద్ద బ్రాండ్‌గా మారిపోయాడన్నది కాదనలేని నిజం. కానీ ఇప్పుడు వస్తున్న కలెక్షన్లకు కారణం ఏంటి? అల్లు అర్జునా? లేకపోతే ‘పుష్ప’ క్రియేట్ చేసిన బ్రాండా? అన్నది తెలియాలంటే మాత్రం అల్లు అర్జున్ తర్వాతి సినిమా విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ చేసిన వసూళ్లు మించకపోయినా... అందులో 70 నుంచి 80 శాతం కలెక్షన్లను అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాతో లాగితే ఇండియాలో నంబర్ వన్ హీరోల్లో ఒకడిగా బన్నీ స్థిరపడిపోయాడని అనుకోవచ్చు.
Also Read: బంజారా హిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్