సంక్రాంతి రేసులో ఎన్నో తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఎక్కువగా సీనియర్ హీరోల సినిమాలే లైన్‌లో ఉన్నాయి. అందుకే సంక్రాంతికి తమ సినిమానే జెండా ఎగరేయడానికి డిసెంబర్ నుండి ప్రమోషన్స్ మొదలుపెడుతున్నారు మేకర్స్. అందులో ‘గుంటూరు కారం’ కూడా ఒకటి. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో మహేశ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుండడంతో ఒక మంచి మాస్ డ్యాన్స్ నెంబర్‌ను ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఫ్యాన్స్ ఆశిస్తున్నట్టుగానే ఒక మాస్ పాటతో అప్డేట్‌తో నిర్మాత నాగవంశీ ముందుకొచ్చాడు.


ఫ్యాన్స్ మెచ్చే మాస్ పాట..
ఇప్పటికే ‘గుంటూరు కారం’ సినిమా నుండి రెండు పాటలు విడుదలయ్యాయి. అందులో ముందుగా విడుదలయిన ‘దమ్ బిర్యానీ’ పాట మహేశ్ మాస్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ పాటను లూప్‌‌లో వింటున్నారు మ్యూజిక్ లవర్స్. దాని తర్వాత శ్రీలీలతో మహేశ్ ప్రేమ పాట ఒకటి విడుదలయ్యింది. ‘ఓ మై బేబీ’ అంటూ సాగే ఈ పాటను ముందుగా నెటిజన్లు ఎంతో ట్రోల్ చేసినా.. ఇప్పుడు లూప్‌లో వినడం మొదలుపెట్టారు. ఇప్పటికే టాలీవుడ్‌లో శ్రీలీలకు డ్యాన్స్ క్వీన్‌గా పేరు ఉంది. అయితే మహేశ్‌తో శ్రీలీల ఒక మాస్ మసాలా పాటకు డ్యాన్స్ చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ‘గుంటూరు కారం’లో అలాంటి పాట ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు నిర్మాత నాగవంశీ.


కుర్చీని మడతపెట్టి..
‘స్పైసీ మాస్ నెంబర్‌కు సంబంధించిన విజువల్స్ చూశాను. సూపర్ స్టార్ మహేశ్ బాబుగారు, శ్రీలీల ఇద్దరూ చితగ్గొట్టేశారు. ఈ పాట స్క్రీన్స్‌పై మంటలు పుట్టిస్తుంది. మన మాస్ భాషలో చెప్పాలంటే.. ఆ కుర్చీని మడతపెట్టి..’ అని నాగవంశీ ట్వీట్ చేశారు. దాంతో పాటు ఒక మాస్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో మహేశ్, శ్రీలీల ఒక మాస్ స్టెప్ వేస్తూ కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అడ్డులేదు. శ్రీలీలలాంటి డ్యాన్సర్‌తో మహేశ్ స్టెప్పులేస్తే.. ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎదురుచూడడం మొదలుపెట్టారు. జనవరి 12న ‘గుంటూరు కారం’ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.






కచ్చితంగా ఈ నెలలోనే..!
క్రిస్ట్మస్ సందర్భంగా ‘గుంటూరు కారం’ నుండి ఇప్పటికే ఒక స్పెషల్ పోస్టర్ విడుదలయ్యింది. అందులో మహేశ్ బాబు క్లాస్ లుక్‌తో కనిపించాడు. ఇప్పుడు మరొక మాస్ పోస్టర్ విడుదలయ్యింది. దీంతో క్రిస్ట్మస్ సందర్భంగా మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ అందింది. మాస్ సాంగ్ ఉంటుందని హింట్ ఇచ్చిన నిర్మాత నాగవంశీ.. ఆ పాట విడుదల ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కానీ ఫ్యాన్స్ అంతా కచ్చితంగా డిసెంబర్‌లో ఈ మాస్ పాట విడుదల ఉంటుందని భావిస్తున్నారు. డిసెంబర్ 31న ఈ పాట గురించి మరొక అప్డేట్ వస్తుందని అనుకుంటున్నారు. శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా ‘గుంటూరు కారం’లో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ ఈ మూవీకి మ్యూజిక్‌ను అందిస్తున్నాడు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Also Read: నల్లగా ఉన్నాడు వీడు హీరో ఏంటని అన్నారు - ట్రోల్స్ పై రోషన్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు, ఎమోషనల్ అయిన సుమ!