Pushpa 2 Sritej : 'పుష్ప 2' తొక్కిసలాట ఘటనకు ఏడాది - బాలుడు శ్రీతేజ్ ఎలా ఉన్నాడో తెలుసా?... 2 కోట్లు డిపాజిట్
Pushpa 2 Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ఏడాది పూర్తి కాగా... బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. బాలుడి ఫ్యామిలీకి అండగా రూ.2 కోట్లు డిపాజిట్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు.

Sritej Health Condition Who Injured In Pushpa 2 Stampede Incident : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'పుష్ప 2' రిలీజై గురువారానికి సరిగ్గా ఏడాది పూర్తైంది. అయితే, ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భాగ్యనగరానికి చెందిన భాస్కర్ భార్య రేవతి మృతి చెందగా... కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
శ్రీతేజ్ ఎలా ఉన్నాడంటే?
బాలుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ఏడాదిగా చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బాలుడి వైద్య ఖర్చులతో పాటు బాధిత కుటుంబానికి అల్లు అర్జున్‌తో పాటు మూవీ టీం అండగా నిలిచింది. అప్పుడే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం సహా బన్నీతో పాటు మూవీ టీం కూడా ఆర్థిక సహాయం అందించింది. ఈ క్రమంలో భాస్కర్ కుటుంబానికి అందుతున్న సాయంతో పాటు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై... తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు వివరించారు. బాబు కోలుకుంటున్నట్లు చెప్పారు.
రూ.2 కోట్లు డిపాజిట్
'గతేడాది సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అల్లు అర్జున్ రూ.2 కోట్లు డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీలో నెలకు రూ.75 వేలు భాస్కర్ కుటుంబ ఖర్చులు, వైద్య ఖర్చుల కోసం వినియోగిస్తున్నాం. మిగిలిన మొత్తాన్ని అసలులో కలిపి ఆపై వచ్చే వడ్డీని ఏటా పెంచి అందించేలా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం బాబు కోలుకుంటున్నాడు.
ఆస్పత్రి ఖర్చుల కోసం అల్లు అరవింద్, బన్నీ ఇప్పటికే రూ.75 లక్షలు చెల్లించారు. ఇప్పుడు అదనపు సహకారం కావాలని భాస్కర్ కోరుతున్నారు. దీన్ని అల్లు అర్జున్ దృష్టికి తీసుకెళ్లాను.' అని దిల్ రాజు చెప్పారు.
Also Read : 'అఖండ 2' ప్రీమియర్స్ రద్దు - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... బాలయ్య ఫ్యాన్స్‌కు బిగ్ షాక్
'సపోర్ట్ ఎప్పుడూ ఉంది'
ఘటన జరిగిన రెండో రోజు నుంచే తన బాబుబు, ఫ్యామిలీకి అల్లు అర్జున్, బన్నీ వాస్‌ల సపోర్ట్ ఎప్పుడూ ఉందని శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తెలిపాడు. 'బాబు ఆరోగ్యం విషయంలో వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. బాబుకు 6 నెలల పాటు రీహాబిలిటేషన్ కొనసాగాల్సి ఉంది. ఈ విషయాన్ని దిల్ రాజు దృష్టికి తీసుకొచ్చాం. అందుకు అవసరమైన వైద్య ఖర్చుల గురించి కూడా చెప్పాం. అల్లు అర్జున్ గారితో మాట్లాడి ఓకే చేశారు. అందుకు థాంక్స్.' అని అన్నారు. అవసరమైతే మరో ఏడాది పాటు కూడా శ్రీతేజ్‌కు రిహాబిలిటేషన్ సదుపాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు దిల్ రాజు వెల్లడించారు.
అంతకు ముందు ఇదే అంశంపై ప్రొడ్యూసర్ బన్నీ వాస్ రియాక్ట్ అయ్యారు. దిల్ రాజు సహా ఇతర పెద్దలు ఎప్పటికప్పుడు సమస్య పర్యవేక్షిస్తున్నారని... తమ వైపు నుంచి ఏవైనా దిద్దుకోవాలంటే సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇచ్చిన ఫండ్ ఎక్కడ ఉంచాలి? ఆస్పత్రి ఖర్చులకు ఎంత వెళ్లాలి? అనేది పర్ఫెక్ట్‌గా నడుస్తుందని అన్నారు.





















