Producer C Kalyan Meet Chiranjeevi On Cine Workers Issue: ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా సినీ కార్మికుల వేతన పెంపు అంశం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఫెడరేషన్, ఫిలిం చాంబర్ మధ్య చర్చలు జరిగినా వివాదం ఓ కొలిక్కి రాలేదు. తమకు 30 శాతం వేతనాలు పెంచాలన్న డిమాండ్‌పై సినీ కార్మికులు పట్టువీడడం లేదు. అటు నిర్మాతలు సైతం ఆ డిమాండ్లకు అంగీకరించడం లేదు. తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ సి.కల్యాణ్ ఈ అంశంపై మెగాస్టార్ చిరంజీవిని కలిశారు.
మెగాస్టార్ ఏమన్నారంటే?
చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవిని కలిసి మాట్లాడినట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. 'నేనెప్పుడూ ఫిల్మ్ చాంబర్, ఫెడరేషన్, నిర్మాతలు బాగుండాలని కోరుకుంటా. సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ కీలకం. నా వంతుగా కార్మికులతో మాట్లాడతా' అని చిరంజీవి అన్నారని కల్యాణ్ తెలిపారు. ఇరువర్గాలకు న్యాయం జరగాలని మెగాస్టార్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆదివారం సాయంత్రం లేదా సోమవారంలోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
'కార్మిక శాఖ పేర్కొన్న వేతనాల కన్నా ఎక్కువ ఇస్తున్నాం. ఓ ఫ్యామిలీలా పని చేయడం సినీ ఇండస్ట్రీలో అలవాటైంది. లేబర్ కమిషన్ రూల్స్ ప్రకారం సినిమాలకు పని చేయలేం. కార్మికులకు భోజనం పెట్టాలనే రూల్ లేకున్నా ఖర్చులన్నీ భరిస్తూ వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతల మధ్య ఎప్పుడూ ఐక్యత ఉండదు. ఏడాదిలో సుమారు 300 సినిమాలు రూపొందితే... వాటిలో 60 చిత్రాలే పెద్దవి. ఫెడరేషన్ వారు సోమవారం చిరంజీవిని కలవనున్నారు. ఆయన పెద్ద మనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఉన్నారు.' అంటూ కల్యాణ్ పేర్కొన్నారు.
Also Read: 'భోళా శంకర్' మూవీ రిజల్ట్ - ప్రొడ్యూసర్‌ను చూసి జాలిపడ్డ క్లర్క్... ఆ స్టోరీ ఏంటో తెలుసా?
మరోవైపు... ఫెడరేషన్‌కు 4 షరతులు, పర్సంటేజీ విధానాలను వివరిస్తూ ఫిలిం చాంబర్ తాజాగా ఓ లేఖ రాసింది.
- రెండో ఆదివారం, కార్మిక శాఖ ప్రకటించిన సెలవు దినాల్లో మాత్రమే రెట్టింపు వేతనం చెల్లించే వీలుంది.
- ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకూ కాల్ షీట్‌ను 12 రెగ్యులర్ పని గంటలుగా పరిగణించాలి.
- 2022 జులైలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం... ఫైటర్స్, డ్యాన్సర్స్ కోసం రేషియోలను 2023 సెప్టెంబర్ నుంచి అమలు చేయడం లేదు. అది కచ్చితంగా ఇవ్వాలి.
- టాలెంట్ ఉన్న ఏ వ్యక్తినైనా తన సినిమా కోసం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ నిర్మాతలకు ఉంటుంది. ఈ షరతులకు అంగీకరిస్తేనే పర్సంటేజీ విధానంలో వేతనాల పెంపు ఉంటుందని వివరించారు.
ఈ షరతులకు ఓకే అంటేనే... రోజుకు రూ.2 వేలు అంతకన్నా తక్కువ సంపాదించే వేతనాల కార్మికులను వెంటనే 10 శాతం పెంచడానికి, తర్వాత ఏడాది నుంచి అదనంగా 5 శాతం, ఆ తర్వాత ఏడాది మరో 5 శాతం పెంచేందుకు నిర్మాతలు ప్రతిపాదించారు. అలాగే, రోజుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ సంపాదించే కార్మికులకు వరుసగా మూడేళ్లు 5 శాతం వేతన పెంపును నిర్ణయించారు. అయితే, తక్కువ బడ్జెట్ చిత్రాల విషయంలో ప్రస్తుత వేతనాలే అమల్లో ఉంటాయన్నారు.
మరోవైపు, ఇండస్ట్రీకి సంబంధించి 24 సంఘాలతో ఫిల్మ్ ఫెడరేషన్ సోమవారం సమావేశం కానుంది. ఫిలిం చాంబర్ లేఖ, వేతనాలు పెంపు, షూటింగ్స్ బంద్ వంటి అంశాలపై చర్చించనున్నారు. మొత్తానికి సోమవారం వరకూ ఈ వివాదానికి ఓ ముగింపు దొరికే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.