అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం దాదాపు వారం రోజుల నుంచి ట్రెండింగ్ లోనే ఉంది. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా, సెటైర్లు విసిరినా సరే పచ్చళ్లతో సింక్ అయ్యేలా చూసుకుంటున్నారు. ఇక మీమ్ రాయుళ్ళు ఓ రేంజ్ ఈ వివాదాన్ని తమ కంటెంట్ గా వాడుకుంటున్నారు అంటే ఈ కాంట్రవర్సీ ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా 'సారంగపాణి' కూడా ఈ వివాదాన్ని తన ప్రమోషన్ కోసం వాడుకున్నాడు. ప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'సారంగపాణి జాతకం' మూవీ రిలీజ్ ప్రమోషన్లలో భాగంగా 'పచ్చళ్ల' బిజినెస్ పెడతాను అంటూ ఆయన చేసిన రీల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని వాడుకుంటున్న సారంగపాణి 

ప్రియదర్శి హీరోగా రూప కొడువాయూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న మూవీ 'సారంగపాణి జాతకం'. ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రియదర్శి ట్రెండింగ్ టాపిక్ లను వాడుకుంటున్నారు. ఇప్పటికే తన బ్లాక్ బస్టర్ మూవీ 'కోర్ట్' మూవీని 'సారంగపాణి జాతకం' కోసం వాడేసాడు. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదాన్ని కూడా వదల్లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ రీల్ పోస్ట్ చేశారు. 

అందులో హీరో హీరోయిన్ ఇద్దరూ కనిపించారు. ముందుగా హీరోయిన్ "ఈ డ్రెస్ ఎంత బాగుందో కదా?" అంటూ ఫోన్లో చూపించింది. ప్రియదర్శి చూసి "నైస్ బాగుంది... రూ.14999... వెరీ ఎక్స్పెన్సివ్" అంటూ షాక్ అయ్యాడు. వెంటనే హీరోయిన్ అందుకుని "నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి. రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ అన్నావ్ అనుకో... వదిలి పెట్టేస్తది నిన్ను. దయచేసి నువ్వు ప్రేమ, పెళ్లిళ్ల జోలికి వెళ్ళకు. కెరియర్ మీద ఫోకస్ పెట్టు. ముష్టి డ్రెస్ ఎక్స్పెన్సివ్ అంటున్నావ్. రేపు నీ పెళ్ళాం ల్యాండ్, బంగారం అడిగితే ఏం కొనిపెడతావ్ రా నువ్వు" అంటూ అలేఖ్య చిట్టి వైరల్ డైలాగ్ ని వాడింది. చివరికి ప్రియదర్శి "పచ్చళ్ల బిజినెస్ పెడతాను" అంటూ అదిరిపోయే పంచ్ వేసాడు.

 

అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం ఇదే 

సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లుగా పేరు తెచ్చుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్ళు రాజమండ్రి వేదికగా అలేఖ్య చిట్టి పేరుతో పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతుంది అనుకుంటున్న తరుణంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రత్యక్షమైంది. అందులో పచ్చళ్ళు కాస్ట్లీగా ఎందుకు ఉన్నాయి? అని ప్రశ్నించిన ఓ నెటిజన్ కు ఈ అక్కాచెల్లెళ్లలో ఒక అమ్మాయి "ముష్టి పచ్చళ్ళే కొనిపెట్టలేని వాడివి పెళ్ళాంతో ఏం సంసారం చేస్తావ్ ? అడిగినది ఎలా కొనిపెడతావ్" అంటూ వినకూడని బూతులతో తిట్టింది. ఈ వీడియో నెట్టింట తీవ్ర దుమారం రేపడంతో ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లపై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. అయితే అలేఖ్య అక్క సుమ కంచర్ల తమను ట్రోలింగ్ చేయొద్దని వేడుకుంది. మరో సిస్టర్ రమ్య కంచర్ల ఎవరో బ్యాడ్ మెసేజ్ పెట్టిన వ్యక్తికి రిప్లై ఇవ్వబోయి పొరపాటున కస్టమర్ కి తన సిస్టర్ అలా మెసేజ్ చేసిందని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది.