Vijayashanthi's Pratighatana Movie: 'ప్రతిఘటన' @ 40 ఇయర్స్... విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ చేసిన సినిమా... ఇప్పటి రాజకీయాల్ని ముందే ఊహించి తీసిన చిత్రమ్
విజయశాంతిని లేడీ సూపర్ స్టార్ చేసిన సినిమా 'ప్రతి ఘటన'. దిగ్గజ దర్శకుడు, హీరో గోపీచంద్ తండ్రి టి. కృష్ణ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇది విడుదలై నేటికి 40 ఏళ్ళు. అప్పట్లో జరిగిన సినిమా విశేషాలు...

సరిగ్గా 40 ఏళ్ల క్రితం అప్పటి గ్రేట్ డైరెక్టర్ టి. కృష్ణ (ఇప్పటి హీరో గోపీచంద్ తండ్రి) తీసిన 'ప్రతిఘటన' రిలీజ్ అయింది. అక్టోబర్ 13, 1985లో రిలీజ్ అయిన 'ప్రతిఘటన' ఇప్పటికీ ఒక సెన్సేషన్. స్టార్ హీరో ఎవరూ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన విజయశాంతిని 'లేడీ సూపర్ స్టార్'గా మార్చింది. చాలా మంది ఆవిడ ఇమేజ్‌కు కారణం 'కర్తవ్యం' అనుకుంటారు గానీ ఆమెకు ఆ ఇమేజ్ తెచ్చిన తొలి చిత్రం 'ప్రతిఘటన'.
ఆ సినిమా తీయడమే ఒక సాహసం
ఉషా కిరణ్ మూవీస్ అధినేత రామోజీ రావు, దర్శకుడు టి కృష్ణ అప్పట్లోనే భవిష్యత్తు రాజకీయాలను ఊహించి తీసిన సినిమాగా 'ప్రతి ఘటన'ను చెప్పుకోవచ్చు. 1980ల నాటికి స్వతంత్ర సమరయోధుల తరం పూర్తయిపోయింది. భవిష్యత్తులో ప్రజల అప్రమత్తంగా ఉండకపోతే నేరచరిత ఉన్నవాళ్లు రాజకీయాల్లో పదవులు చేపట్టే అవకాశం ఉందని ఊహించి తీసిన సినిమా 'ప్రతిఘటన'. అయితే ఇలాంటి సినిమాలకు అప్పట్లో పెద్దదిక్కుగా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు లాంటి హీరోలు కాకుండా ఒక హీరోయిన్ నేపథ్యంలో నడిచే సినిమాగా 'ప్రతి ఘటన'ను రూపొందించారు. అప్పటికే 'నేటి భారతం', 'దేశంలో దొంగలు పడ్డారు', 'దేవాలయం' లాంటి టీ కృష్ణ సినిమాల్లో నటించిన విజయశాంతినే హీరోయిన్‌గా తీసుకుని, అప్పటికి కన్నడ సినిమాల్లో హీరోగా చేస్తున్న చరణ్ రాజ్ ను విలన్ కాళీ పాత్రకు ఎన్నుకుని 'ప్రతి ఘటన' రూపొందించారు.
'ప్రతి ఘటన' సినిమా కథ తెలుసా?
కాళీ అనే రౌడీ ఏలుతున్న నగరానికి కొత్తగా వస్తారు లాయర్ గోపాల కృష్ణ, లెక్చరర్ ఝాన్సీ దంపతులు. అదే ఊళ్ళో ఉండే నిజాయితీపరుడైన ఇన్స్పెక్టర్ ప్రకాష్ ను హత్య చేస్తాడు కాళీ. దాన్ని చూసిన ఝాన్సీ కంప్లైంట్ ఇవ్వడంతో ఆ కంప్లైంట్ ను వెనక్కి తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి తేవడమే కాకుండా ఆమెను నడిరోడ్డులో వివస్త్రను చేస్తారు కాళీ మనుషులు. పిరికి వాడైన ఆమె భర్త గోపాలకృష్ణ భార్యకు ఏ విధంగానూ సాయపడలేక పోతాడు. వ్యవస్థలన్నీ తనకు అన్యాయం చేస్తున్న పరిస్థితుల్లో ఝాన్సీ ఏ విధంగా ప్రతీకారం తీసుకుంది? అనేది మిగిలిన సినిమా కథ.
'ప్రతి ఘటన'... 1985లో బ్లాక్ బస్టర్
ఒక పక్క సూపర్ స్టార్ కృష్ణ 'అగ్ని పర్వతం', 'వజ్రాయుధం', మెగాస్టార్ చిరంజీవి 'అడవి దొంగ' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పోటీపడి మరీ 'ప్రతిఘటన' సూపర్ డూపర్ హిట్ అయింది. ఏకంగా తొమ్మిది కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు అడడంతో పాటు ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు 6 నంది అవార్డ్స్ సాధించిన ఈ సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ప్రతిష్ట పెంచింది. ఈ సినిమా విజయంతో విజయశాంతి టాప్ మోస్ట్ హీరోయిన్‌గా శ్రీ దేవి స్థాయిని అందుకోగా... చరణ్ రాజ్ తెలుగులో విలన్ గా స్థిరపడ్డారు. కోట శ్రీనివాస రావుకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాను ఉషా కిరణ్ మూవీస్ మలయాళంలో టి కృష్ణ దర్శకత్వంలో 'పకర తిన్ను పకారం' పేరుతో రీమేక్ చేయగా... అక్కడా హిట్ అయింది. హిందీలో 'ప్రతి ఘాత్' పేరుతో 1987లో రీమేక్ చేశారు. అప్పటికే టి. కృష్ణ క్యాన్సర్ తో మృతి చెందడంతో ఆయనకు బదులుగా ఎన్. చంద్ర దర్శకత్వం వహించారు. హిందీలోనూ చాలా పెద్ద హిట్ అయింది.
అసలు మూలం ఒక తమిళ సినిమా?
కే బాలచందర్ 1984లో తమిళంలో 'అచ్చమిళ్ళై... అచ్చమిళ్ళై' అనే మూవీ తీశారు. అందులో సరిత హీరోయిన్. ఒక ఆదర్శవంతుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ప్రజా కంఠకుడిగా మారడంతో అతడ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బహిరంగ సభలో చంపేస్తుంది. ఆ క్లైమాక్స్ బేస్ చేసుకుని పూర్తిగా కొత్త కథతో 'ప్రతి ఘటన' సినిమాను రూపొందించారని సినీ పండితులు చెబుతుంటారు. ఏదేమైనా లేడీ ఓరియంటెడ్ కథతో ఆ రోజుల్లో అంత పెద్ద మాస్ హిట్ కొట్టడం అనేది అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏడాదే దర్శకుడు టి కృష్ణ అకాల మరణం చెందినా ఆయనను టాలీవుడ్ గ్రేట్ దర్శకుల్లో ఒకరుగా నిలిపిన సినిమాగా 'ప్రతి ఘటన' రికార్డులకు ఎక్కింది.





















