Prasanth Varma Movie With Ranveer Singh: ‘హనుమాన్’తో కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ప్రశాంత్ వర్మ. అప్పటివరకు ఈ డైరెక్టర్ గురించి చాలామంది ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. ‘హనుమాన్’తో తానేంటో నిరూపించుకున్నాడు. కేవలం ప్రశాంత్ వర్మ మాత్రమే కాదు.. తేజ సజ్జా కూడా ఈ మూవీతోనే పాపులర్ అయ్యాడు. ప్రశాంత్ వర్మ అయితే తన సినిమాటిక్ యూనివర్స్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే కొన్నాళ్ల పాటు తన సినిమాటిక్ యూనివర్స్‌ను పక్కన పెట్టి ఒక బాలీవుడ్ స్టార్‌తో మూవీ చేయడానికి ప్రశాంత్ వర్మ సిద్ధమయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.


మధ్యలో ఏంటిది?


2024 సంక్రాంతికి ‘హనుమాన్’ వచ్చి ఓ రేంజ్‌లో హిట్‌ను అందుకుంది. ఇక దీని సీక్వెల్ అయిన ‘జై హనుమాన్’.. వచ్చే ఏడాది సంక్రాంతికి వస్తుందని ప్రశాంత్ వర్మ చాలాకాలం క్రితం ప్రకటించాడు. కానీ ఔట్‌పుట్ బాగుండాలంటే తొందరపడకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా తానే చెప్తున్నాడు. అందుకే ‘జై హనుమాన్’ వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందని చాలామంది ప్రేక్షకులు అనుకోవడం లేదు. కానీ ప్రశాంత్ వర్మ మాత్రం వీలైనంత త్వరగా దీనిని ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతలోనే ప్రశాంత్ వర్మ.. ఒక బాలీవుడ్ స్టార్‌తో సినిమా చేస్తున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


బడా నిర్మాణ సంస్థల హస్తం..


‘జై హనుమాన్’లో కచ్చితంగా బాలీవుడ్ స్టార్ ఉంటాడని ప్రశాంత్ వర్మ ఇంతకు ముందే రివీల్ చేశాడు. ఇక తాను చెప్పినట్టుగానే రణవీర్ సింగ్.. ఈ సినిమాలో నటించనున్నాడని అటు బాలీవుడ్‌లో, ఇటు టాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న మరికొన్ని కథనాల ప్రకారం.. రణవీర్ సింగ్, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కేది ‘జై హనుమాన్’ కాదని, వీరిద్దరి కాంబినేషన్‌లో వేరే సినిమాను తెరకెక్కించాలని బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ కాంబినేషన్‌ను సెట్ చేయడానికి టీ సిరీస్, వియాకామ్ 18, జియో స్టూడియోస్ లాంటి సంస్థలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.


ముందు ఏది?


ప్రశాంత్ వర్మ.. ‘హనుమాన్’ విడుదల అయిన సమయంలో రణవీర్ సింగ్‌కు ఒక కథను వినిపించాడట. ఆ కథ రణవీర్‌కు కూడా బాగా నచ్చిందట. ఇప్పటికే వీరిద్దరూ పలుమార్లు కలిసి ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను చర్చించుకున్నట్టు సమాచారం. అయితే ‘జై హనుమాన్’తో ప్రశాంత్ వర్మ తమను అలరిస్తాడని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే ఈ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను దాదాపుగా పూర్తిచేశాడు ప్రశాంత్. అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి రణవీర్ సింగ్‌తో సినిమా చేస్తాడా లేదా ‘జై హనుమాన్’ తర్వాతే ఈ ప్రాజెక్ట్ ఓకే అవుతుందా అని చర్చించుకుంటున్నారు.



Also Read: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?