కేరళకు చెందిన ప్రముఖ గాయని సంగీత సాజిత్ (46) ఆదివారం మరణించారు. సంగీతకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నాయని, వాటికి చికిత్స కూడా పొందుతున్నట్లు సమాచారం. తిరువనంతపురంలోని తన సోదరి ఇంట్లో ఆవిడ మృతి చెందారు. తయక్కాడ్‌లోని శాంతి కావడంలో ఆవిడ అంత్యక్రియలు జరిగాయి.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200కు పైగా పాటలను ఆవిడ పాడారు. ప్రేమించుకుందాం రా సినిమాలోని ‘సంబరాల’ అనే పాటను ఎస్పీ బాలసుబ్రమణ్యం, కేఎస్ చిత్రలతో కలిసి ఆలపించారు. రక్షకుడు సినిమాలో ‘ప్రేమే నా గమ్యమన్నా’, ప్రభాస్ అడవి రాముడులో‘అడుగేస్తేనే’ వంటి పాపులర్ పాటలు ఆవిడ పాడినవే.
1992లో వచ్చిన ‘నాలియ తీర్పు’లో ఆవిడ మొదటి పాట పాడారు. తెలుగులో కూడా మార్కెట్ సంపాదించుకున్న తమిళ సూపర్ స్టార్ విజయ్‌కు అదే మొదటి సినిమా కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ తమిళ సినిమాల్లో ఆవిడ పాడిన పాటలకు మంచి స్పందన వచ్చింది.
సంగీత ఎక్కువగా మలయాళం పాటలను ఆలపించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన కురుతి సినిమాలో ఆవిడ తన చివరి పాట పాడారు. కేరళ సీఎం పినరపి విజయన్, ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్, గాయని చిత్ర ఆవిడకు నివాళులు అర్పించారు.