Special Martial Arts Weapons Designed For Pawan Kalyan In Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్క్రీన్‌పై కనిపిస్తేనే ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. ఇక ఇదివరకు ఎన్నడూ చూడని పవర్ ఫుల్ రోల్ అంటే థియేటర్స్ దద్దరిల్లాల్సిందే. లేటెస్ట్ పీరియాడికల్ అడ్వెంచరస్ 'హరిహర వీరమల్లు'లో ఆయన లుక్ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌లో పవన్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. యుద్ధ సన్నివేశాల్లో పవన్ పవర్ మామూలుగా లేదు. శత్రు సైన్యం వరుసగా బాణాలు ఆయుధాలు ఎక్కుపెడుతున్నా... ఒంటి చేత్తోనే తన ఆయుధంతో వాటిని పడగొడతారు పవన్. అయితే... మూవీలో ఈ యాక్షన్, వార్ సీక్వెన్స్ వెనుక  ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది.

4 వెపన్స్... మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్

'హరిహర వీరమల్లు' మూవీ కోసం ప్రత్యేకంగా నాలుగు వెపన్స్ డిజైన్ చేశారు మేకర్స్. వీటి కోసం మార్షల్ ఆర్ట్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు పవన్ కల్యాణ్. ఈటె, కత్తి, కర్ర, బాకు వెపన్స్ రూపొందించగా వాటిని ఉపయోగించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

దాదాపు 100 రోజులు పవన్ వివిధ ఆయుధ శైలిలో ట్రైనింగ్ తీసుకున్నారు. షావోలిన్ కుంగు (చైనీస్), సిలాట్ (ఇండోనేషియా), కలరియపట్టు (ఇండియా), బుడో (జపనీస్) అనే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ పవన్ డెడికేషన్‌కు ఇదే నిదర్శనమని... ఆయనే ఓ వెపన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పోరాట సన్నివేశాలు ఆద్యంతం ఆడియన్స్‌ను కట్టి పడేస్తాయని మేకర్స్ చెబుతున్నారు. 

Also Read: రాజమౌళిని హీరో చేయాలనుకున్న పెదనాన్న... శివ‌శ‌క్తి ద‌త్తా దర్శకత్వంలో ఆగిపోయిన మైథ‌లాజిక‌ల్ మూవీ ఏదో తెలుసా?

రన్ టైం... వైరల్

ఈ నెల 24న మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే ఓవర్సీస్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అక్కడ ఓ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫాం మూవీ రన్ టైం 2.40 గంటలుగా పేర్కొంది. దీంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమాలో పోస్ట్ ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్‌లోని కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ ఉంటాయని హీరోయిన్ నిధి అగర్వాల్ అభిమానులతో చిట్ చాట్‌లో వెల్లడించారు. 

ఈ మూవీ ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా ట్రెండింగ్‌గా మారింది. సినిమా రెండు పార్టులు కాగా... 'హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించగా... నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో ఎ దయాకరరావు నిర్మిస్తున్నారు. ఔరంగజేబుగా బాలీవుడ్ స్టార్ సన్నీడియోల్‌తో పాటు అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్ గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, నోరా ఫతేహి, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ మూవీ కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.