Pawan Kalyan Appreciates Kamal Haasan Being Selected As A Member In Oscar Academy: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్‌కు ఆస్కార్ అకాడమీలో మెంబర్‌గా చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో ఆయన భాగం కానున్నారు. తాజాగా... దీనిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. కమల్‌పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.
కమల్ రియల్ మాస్టర్
కమల్‌కు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమని అన్నారు. 'పద్మభూషణ్ కమల్ హాసన్ ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్ 2025 కమిటీ సభ్యుడిగా ఎంపిక కావడం ఇండియన్ సినీ ఇండస్ట్రీకే గర్వకారణం. 6 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో అందరినీ అలరించారు. కమల్ గారు ఓ నటుడి కంటే ఎక్కువ. నటుడిగా, కథకుడిగా, దర్శకుడిగా ఆయన సినిమా ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞ, దశాబ్దాల అనుభవం... భారతీయ, ప్రపంచ సినిమాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి.
చిత్ర నిర్మాణంలోని ప్రతి అంశంపై కమల్ అసాధారణమైన ప్రతిభ నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన కళలో నిజమైన మాస్టర్. నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ప్రపంచ సినిమాకు ఆయన మరింత ప్రభావవంతమైన సేవ చేయాలని కోరుకుంటున్నా.' అంటూ రాసుకొచ్చారు.
కమిటీ మెంబర్‌గా కమల్ రియాక్షన్
మరోవైపు... ఆస్కార్ అకాడమీ మెంబర్‌గా ఎంపిక కావడంపై కమల్ హాసన్ స్పందించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో చేరడం ఎంతో గౌరవంగా ఉందన్నారు. 'ఈ గుర్తింపు నా ఒక్కడికే కాదు. భారతీయ చలనచిత్ర సమాజంతో పాటు నన్ను తీర్చిదిద్దిన లెక్కలేనన్ని డైరెక్టర్స్, రైటర్స్ అందరిది. భారతీయ సినిమా ప్రపంచానికి అందించడానికి చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా అనుబంధాన్ని మరింత పెంచుకోవాలని ఎదురుచూస్తున్నా. అకాడమీలో చేరిన నా తోటి యాక్టర్స్, టెక్నికల్ నిపుణులకు నా అభినందనలు.' అంటూ ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది.
Also Read: టాప్ ప్లేస్‌లో 'మురుగ' బుక్ - మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మ్యాజిక్... రైటర్ రియాక్షన్ ఇదే
కమల్‌తో పాటు ఇండియన్ స్టార్స్
ఈ ఏడాది ఎంతోమంది హాలీవుడ్ యాక్టర్స్‌తో పాటు ఇండియన్స్ స్టార్స్ కూడా ఆస్కార్ అకాడమీలో చోటు దక్కింది. 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' తాజాగా ఈ జాబితా రిలీజ్ చేసింది. ఇందులో కమల్‌తో పాటు ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఉన్నారు. కొత్తగా 534 మంది సభ్యులను ఆహ్వానించినట్లు అకాడమీ తెలిపింది. ఆస్కార్‌కు నామినేట్ అయ్యే చిత్రాల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో వీరికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది.