Happy Birth Day Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, అభిమానులు ముద్దుగా ' పవర్ స్టార్' అని పిలుచుకుంటారు. ఆయన పేరు వింటేనే యువతకు పూనకం వస్తుంది. అయితే పవన్ కల్యాణ్ పేరు మాత్రం అది కాదు. ఆయన మొదట్లో వేరే పేరుతో పిలిచే వాళ్లు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సాహసాలు, తెగువ చూసిన వాళ్లు ఆయనకు ఈ పేరు పెట్టారు.
1996లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'సినిమాతో పవర్ స్టార్ సినీరంగ ప్రవేశం చేశారు. చిరంజీవి తమ్ముడుగానే తెరంగేట్రం చేసినా తొలి సినిమా నుంచే తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు. రియల్‌గా స్టంట్స్ చేసి అబ్బురపరిచారు. సినిమాల్లో ఆయన్ని చూసి అభిమానం పెంచుకున్న వాళ్లు కొందరైతే ఆయన వ్యక్తిత్వం మెచ్చి ఫ్యాన్‌గా మారిన వారు అంతకు మించి ఉంటారు. తన నిరాడంబరత , సామాన్య వ్యక్తిత్వం కారణంగా ఆయన కోట్లాది మంది ప్రజల హృదయాల్లో పెట్టుకున్నారు. పవన్ తన పేరును ఎలా పొందారనే దాని గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది.
పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కథ
పవన్ కల్యాణ్ నటుడు కాక ముందు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందారు. ఇలా శిక్షణ పొందుతున్న రోజుల్లో ఓ ఘటన జరిగిందని చెబుతారు. ఓ పోటీలో పవన్ కల్యాణ్ ప్రమాదకరమైన టెక్నిక్‌ను ప్రదర్శించారు. గాజుతో ఉన్న ఓ ప్లేట్‌ను తన శక్తితో బ్రేక్ చేశారట. డేంజర్ ఫీట్ ను ప్రత్యక్షంగా చూసిన అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఆయన్ని హనుమంతుడితో పోల్చారు. ఆయనలో చాలా శక్తి ఉన్నా సరే అప్పటి వరకు ఏం తెలియని వ్యక్తిలా ఉన్నారు. అవసరం అయినప్పుడు శక్తిని వాడుకున్నారు. అందుకే ఆయన్ని పవన్ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పటి వరకు కల్యాణ్‌బాబు అని పిలిచే వాళ్లు. దీనికి పవన్ జోడించారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ అని పిలవడం మొదలు పెట్టారు. అందుకే మొదటి సినిమాలో కూడా కల్యాణ్ బాబు అని మాత్రమే ఉంటుంది.
అయితే కల్యాణ్‌బాబు కూడా తన ఒరిజినల్ పేరు కాదని తల్లి అంజనాదేవి ఓ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఆయన అసలు పేరు కల్యాణ్ కుమార్ అని, అయితే ఇంట్లో చిన్న వాడు కావడంతో అంతా కల్యాణ్ బాబు అని పిలిచే వారు. దీంతో సినిమాల్లోకి రాక ముందు వరకు కల్యాణ్ బాబు అని పేరు ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన బలాన్ని ప్రదర్శించి పవన్‌గా మారారు. రెండో సినిమా నుంచే పవన్ కల్యాణ్‌గా మారిపోయారు. క్రమంగా అభిమానులకు మరింత దగ్గరై పవర్ స్టార్‌గా మారిపోయారు. రాజకీయాల్లో రియల్ గేమ ఛేంజర్‌గా ముద్ర వేసుకున్నారు. సినిమాల్లోకి వచ్చే ఆసక్తి మొదటి నుంచి లేదని కానీ రాక తప్పలేదని అంటూ ఉంటారు పవన్ కల్యాణ్. కానీ ఇష్టంలేకుండా సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఆయన చేసిన సినిమాలను అంత ఈజీగా తీసుకోలేదు. తనదైన శైలి నటనతో ఆకట్టుకున్నారు. ఆయన ఒక్క యాక్టర్‌గానే కాకుండా డైరెక్టర్‌గా, ఫైట్ కంపోజర్‌గా, సింగర్‌గా కూడా తన మార్క్ చూపించారు.
దేశం పట్ల, సమాజం పట్ల విపరీతమైన అభిమానం ఉన్న పవన్ కల్యాణ్... తన సినిమాల్లో కూడా అది ఉండేలా చూసుకుంటారు. ఎంత ఎదిగినా సరే అన్న చిరంజీవి చాటు తమ్ముడిగా ఉంటూ వచ్చారు. అన్న రాజకీయ పార్టీ పెడితే ఊరూరా తిరిగి పార్టీ కోసం కష్టపడ్డారు. అన్న చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ప్రజలకు ఏదైనా చేయాలనే ఆకాంక్షతో 2014లో జనసేన పేరుతో కొత్త పార్టీ పెట్టారు. దీంతో ఆయన ఇమేజ్ దేశవ్యాప్తమైంది. ప్రధానమంత్రి మోదీ లాంటి వ్యక్తులే ఆయన్ని తుపాను పోల్చడం అందరికీ తెలిసిందే.