Pawan Kalyan Return To India With His Son Mark Shankar: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్‌తో (Mark Shankar) హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో తన కొడుకుని ఎత్తుకుని పవన్ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

కోలుకున్న మార్క్ శంకర్

8 ఏళ్ల మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని (Singapore) ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుండగా.. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. చిన్నారి చేతులు, కాళ్లకు గాయాలు కావడం సహా.. లంగ్స్‌లోకి పొగ చేరుకోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్కూల్ సిబ్బంది వెంటనే శంకర్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకున్నాడు. 

కొద్ది రోజుల విశ్రాంతి కోసం..

శంకర్‌కు కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని.. అందుకే ఇండియాలో ఇంట్లో ఉంచి జాగ్రత్తగా చూసుకోవాలని పవన్ దంపతులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే పవన్ తన పర్యటన రద్దు చేసుకుని విశాఖ నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి సింగపూర్‍‌కు చేరుకున్నారు. అటు, మెగాస్టార్ చిరంజీవి దంపతులు సైతం సింగపూర్ చేరుకుని మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

పవన్, చిరంజీవి ఇద్దరూ దగ్గరుండి ఎప్పటికప్పుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతూ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ ఇస్తూ వచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత ఒక రోజు చికిత్స అనంతరం.. శంకర్ పూర్తిగా కోలుకున్నాడని మెగాస్టార్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరగా.. బ్రాంకోస్కోప్ ద్వారా బయటకు పంపేసినట్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. చిన్నారి తాజా ఫోటోను రిలీజ్ చేశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: అల్లు అర్జున్ ‘పుష్ప 2 ది రూల్’, వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టు మహేష్ ‘టక్కరి దొంగ’, ఎన్టీఆర్ ‘టెంపర్’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 13) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్

మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే అంతా ఆందోళనకు గురయ్యారు. పాలిటిక్స్‌ను సైతం పక్కన పెట్టి అంతా చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు.. శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అధినేత జగన్, రోజా కూడా పవన్‌కు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చిన్నారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చాలామంది ప్రముఖులతో పాటు పవన్ ఫ్యాన్స్, జనసైనికులు శంకర్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు. 

కాపాడిన వారికి అవార్డులు

సింగపూర్ స్కూల్లో జరిగిన ప్రమాదంలో పవన్ కుమారుడు సహా 16 మంది చిక్కుకున్నారు. ఇదే సమయంలో అక్కడ పని చేస్తున్న నలుగురు భారతీయ వలస కార్మికులు వారిని కాపాడారు. చిన్నారులతో సహా నలుగురు పెద్దలను సైతం రక్షించారు. వీరందరికీ సింగపూర్ ప్రభుత్వం పురస్కారాలు అందించింది.