Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాను రామాయణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించారు. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. అదే రోజు సినిమాకు సంబంధించిన ఫైనల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ ఫైనల్ ట్రైలర్ లో తప్పులు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో మూవీ దర్శకుడిపై సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. 


ట్రైలర్ లో ఉన్న తప్పులేంటి?


‘ఆదిపురుష్’ సినిమా ను అనౌన్స్ చేసిన దగ్గర నుంచీ ఈ సినిమా దర్శకుడి పై ఏదొక విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ లో కూడా తప్పులు కనిపించడంతో ఓమ్ రౌత్ ను విమర్శిస్తున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ తప్పేంటంటే.. సీతమ్మ జాడ తెలుసుకోవడవం కోసం ఆంజనేయున్ని పంపుతాడు శ్రీరాముడు. హనుమంతుడితో పాటు తన గుర్తుగా సీతాదేవికి ఇవ్వమని చెప్పి తన ఉంగరాన్ని కూడా ఇస్తాడు. లంకలో సీతమ్మ జాడ తెలుసుకున్న హనుమంతుడు ఆ ఉంగరాన్ని చూపించి శ్రీరాముని దూతగా వచ్చానని, తనతో పాటు రావాలని సీతమ్మను కోరతాడు. అయితే సీతమ్మ అందుకు అంగీకరించకుండా శ్రీరాముడే రావణున్ని జయించి తనను తీసుకెళ్తాడని చెప్తుంది. దీంతో హనుమ వెనుదిరుగుతాడు. అయితే సీతమ్మ కూడా తన ఆనవాలుగా శ్రీరాముడికి ఇవ్వమని తన వద్ద ఉన్న చూడామణి ఇచ్చి పంపుతుంది. ఏ రామయణంలో చూసినా ఇదే కనిపిస్తుంది. కానీ ఈ ‘ఆదిపురుష్’ సినిమాలో మాత్రం సీతమ్మ హనుమంతుడి చూడామణి కాకుండా గాజులు ఇచ్చినట్టు చూపించారు. ఆ విషయం ట్రైలర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ఓమ్ రౌత్ ను విమర్శలకు గురిచేస్తుంది. అంతేకాదు, సీతమ్మను రావణుడు అపహరించుకుని వెళ్లేప్పుడు.. ఆమెను తాకకుండా ఆమె నిలబడిన చోట ఉన్న మట్టితో సహా ఎత్తుకుని వెళ్తాడు. అయితే, ఇందులో ఊడలతో ఆమెను బంధించి తీసుకెళ్తున్నట్లు చూపించారు. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూవీపై విమర్శలు రాకూడదని చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. ఏదో ఒక తప్పు నెటిజనుల కంట్లో పడుతోంది. మరి, ఈ ట్రోల్స్ సినిమాపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.


ఓమ్ రౌత్ పై నెటిజన్స్ ఫైర్..


‘ఆదిపురుష్’ సినిమా దర్శకుడు మొదట్నుంచీ విమర్శలకు గురవుతూనే ఉన్నాడు. గతంలో కూడా మూవీ మొదటి ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఇలాగే విమర్శలు ఎదుర్కొన్నాడు ఓమ్ రౌత్. మూవీ లో గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ పై విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో ఆ ట్రైలర్ ను రద్దు చేసి గ్రాఫిక్స్ ను మార్చి మళ్లీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా రామయణాన్నే మార్చే విధంగా మూవీలో సన్నివేశాలు ఉండటంతో దర్శకుడిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్స్. సినిమాను ఎలాగైనా తీయొచ్చు కానీ రామాయణంలో ఉన్న మూలాలను ఎలా మారుస్తారు అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఈ దర్శకుడు రామాయణం గురించి పూర్తిగా తెలుసుకునే తీశాడా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా మున్ముందు ఇంకెన్ని తప్పులు కనిపిస్తాయో అని విమర్శిస్తున్నారు. మరి దీనిపై దర్శుకుడు ఓమ్ రౌత్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక ఈ మూవీ జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read : శేష వస్త్రంతో తిరుమలలో ముద్దులు, కౌగిలింతలా? - చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుల ఆగ్రహం