యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్' ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ అయింది. రామాయణం ఇతిహాసంలోని కొన్ని ప్రధాన ఘట్టాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఈ మైథలాజికల్ డ్రామాకి తొలి రోజే మిశ్రమ స్పందన లభించింది. 'ఆదిపురుష్' ను బాయ్ కాట్ చేయాలంటూ నార్త్ ఆడియెన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు.  


వాల్మీకి రచించిన అద్భుత కావ్యం 'రామాయణం' ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. అజరామరమైన అలాంటి కావ్యాన్ని ఎంతో మంది దర్శకులు దృశ్యరూపంలో వెండితెర మీద ఆవిష్కరించారు. నేటి తరానికి ‘రామాయణం’ గొప్పతనాన్ని తెలియచెప్పే ఉద్దేశ్యంతో ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్ రాముడిగా నటించగా.. జానకిగా కృతి సనన్, లంకేష్ గా సైఫ్ ఆలీఖాన్ నటించారు. ప్రచార చిత్రాలు రిలీజ్ చేసినప్పటి నుంచే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ చిత్రంపై నార్త్ లో బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. 


ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ఆదిపురుష్ పై ఉత్తరాది సినీ అభిమానులు ట్విట్టర్ లో రెచ్చిపోతున్నారు. అసలు వాల్మీకీ రామాయణంలో ప్రస్తావించిన ఏ అంశాన్ని డైరెక్టర్ ఓం రౌత్ ఫాలో కాలేదంటూ మండిపడుతున్నారు. రామాయణ పాత్రలను అవమానించారంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు. అధ్బుతమైన ఇతిహాసాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని ట్వీట్స్ చేస్తున్నారు. ప్రభాస్, సైఫ్, కృతి లుక్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రభాస్ గెటప్ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ లా ఉందని.. లక్ష్మణుడి పాత్రకు ఒంటి నిండా టాటూలు ఉండటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. రావణుడినైతే ఏదో మొఘల్ సామ్రాజ్యాధినేతలా చూపించారంటూ పోస్ట్ లు పెడుతున్నారు. లెదర్ బెల్టులు, చెప్పులు ధరించిన రాముడు.. సీతాదేవి వస్త్రాలపైనా అభ్యంతరాలు వ్యక్తవుతున్నాయి. ఏ కోణంలోనూ రామాయణం చూసినట్లుగా అనిపించలేదని.. సినిమాను తక్షణమే నిలిపివేయాలని నార్త్ ఆడియన్స్ ట్వీట్లు పెడుతున్నారు.


రావణుడి పాత్రకు సంబంధించిన స్క్రీన్ షాట్స్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హాలీవుడ్ మూవీస్ స్పూర్తితో సైఫ్ అలీ ఖాన్ లుక్ ని డిజైన్ చేశారని.. అసలు సైఫ్ ఏ కోశాన కూడా రావణాసురుడిని తలపించలేదని కామెంట్లు పెడుతున్నారు. ఇందులో ఒక క్యామియో వుందని, అది జీసస్ లుక్ ని పోలి ఉందని ట్రోలింగ్ చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాలను కించపరిచేలా, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా 'ఆది పురుష్' సినిమా వుందని విమర్శిస్తున్నారు. 


నిజానికి 'ఆదిపురుష్' మూవీ విడుదలకు ముందే అందరిలో ఎన్నో సందేహాలు తలెత్తాయి. ఎందుకంటే ఎన్నో అంచనాల మధ్య వదిలిన తొలి టీజర్‌పై జనాలు మండిపడ్డారు. అసలు రామాయణంలానే లేదని, ఇలాంటి నాసిరకమైన అవుట్ ఫుట్ కోసం కోట్ల రూపాయలు తగలేశారని కామెంట్లు చేశారు. దీంతో మరో ఆరు నెలలు రిలీజ్ వాయిదా వేసి, ఏవో చేంజెస్ చేసి రెండో ట్రెయిలర్ తో మెప్పించారు. ఈ నేపథ్యంలో సినిమాపై భారీ హైప్ వచ్చింది. కానీ ఇప్పుడు విడుదల తర్వాత ఎప్పటిలాగే మళ్లీ ట్రోలింగ్ కొనసాగుతోంది. మరి ఇవన్నీ తట్టుకొని ప్రభాస్ 'ఆదిపురుష్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.


Read Also: 18 ఏళ్ల ‘నో కిస్’ రూల్‌ను బ్రేక్ చేసిన తమన్నా - ఈ నిర్ణయం అతడి కోసమేనట!