సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్యాగ్స్ ఎక్కువగా హీరోలకే కనిపిస్తాయి. హీరోయిన్లను మాత్రం బ్యూటీ క్వీన్, డాన్సింగ్ క్వీన్ అంటూ పిలుస్తారు. కానీ ఈ ఆనవాయితీని లేడీ సూపర్ స్టార్ నయనతార బ్రేక్ చేసింది. ప్రేక్షకుల చేత లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకొని, ఆమె ఇండస్ట్రీలో లేడీ ఐకానిక్ స్టార్ గా నిలిచింది. కానీ నయనతారను 'లేడీ సూపర్ స్టార్' అని పిలవడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదంపై ఓ ఇంటర్వ్యూలో నయనతార స్పందిస్తూ, దర్శక నిర్మాతలను అలా చేయొద్దని వేడుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
నయనతార 'లేడీ సూపర్ స్టార్' వివాదం...
కమర్షియల్ సినిమాలతో సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార, ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సినిమాలో హీరో అన్నవాడు లేకపోయినా సరే ఆమె ప్రేక్షకుడిని థియేటర్లకు తీసుకురాగల సత్తా కలిగిన హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. దీంతో అభిమానులు ఆమెను 'లేడీ సూపర్ స్టార్' అని పిలవడం మొదలుపెట్టారు. అయితే రీసెంట్ గా థియేటర్లో సినిమా టైటిల్ టైంలో నయనతార పేరుకు 'లేడీ సూపర్ స్టార్' అనే ట్యాగ్ వేయడం వివాదాస్పదంగా మారింది. నయనతార 'అన్నపూర్ణి' అనే లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ లోనే 'లేడీ సూపర్ స్టార్' అనే ట్యాగ్ ను నయనతార పేరుకి జత చేసారు మేకర్స్. దీంతో రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో నయనతారతో పాటు ఆ మూవీ యూనిట్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. రజనీకాంత్ అభిమానులు 'సూపర్ స్టార్' అనే ట్యాగ్ ఇంకెవరికి ఉండకూడదు అంటూ నయనతారను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే అప్పట్లోనే నయనతార వివాదంపై స్పందిస్తూ... తనకు తెలియకుండా ఇదంతా జరిగిందని, అలా 'లేడీ సూపర్ స్టార్' అనే ట్యాగ్ తగిలించడం వల్ల తనను 10 మంది పొగిడితే, 50 మంది తిడుతున్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకలా పిలిపించుకోవాలని, ఆ ట్యాగ్ వేయించుకోవాలని ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చింది.
'లేడీ సూపర్ స్టార్' వివాదంపై నయనతార వివాదాస్పద కామెంట్స్
తాజాగా మరోసారి ఓ ఇంటర్వ్యూలో భాగంగా నయనతార ఈ లేడీ సూపర్ స్టార్ వివాదం గురించి వివాదాస్పద కామెంట్స్ చేసింది. దీని గురించి నయనతార మాట్లాడుతూ "అసలు లేడీ సూపర్ స్టార్ టైటిల్ కోసం నేను ఎదుర్కొన్న బ్యాక్ ల్యాష్ ను నమ్మలేకపోతున్నాను. మగవాళ్ళు సక్సెస్ ఫుల్ మహిళను చూస్తే అసూయపడతారని అనుకుంటున్నాను. అప్పటికే నేను ఆ ట్యాగ్ ను పెట్టొద్దని నా నిర్మాత, దర్శక నిర్మాతలను వేడుకున్నాను" అంటూ కామెంట్ చేసింది. దీంతో మహిళలు సక్సెస్ అయితే తప్పులేదు గానీ, అహంకారిగా మారకుండా ఉంటే చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇప్పుడు నయన్ చేసిన ఈ కామెంట్స్ మరో వివాదానికి దారి తీసేలా కన్పిస్తున్నాయి. రీసెంట్ గా నయనతార, ధనుష్ మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. నయనతార పెళ్లి డాక్యుమెంటరీలో 'నేనూ రౌడీనే' సినిమాకు సంబంధించిన క్లిప్ ని వాడడంపై ఆ మూవీ నిర్మాత ధనుష్... అందులో హీరోయిన్ గా నటించిన నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై ఇంకా ఇద్దరూ లీగల్ గా పోరాడుతున్నారు.