Teja Sajja's Mirai Movie Box Office Collections: యంగ్ హీరో తేజ సజ్జా సూపర్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'మిరాయ్' మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించగా... 5 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. వీకెండ్ కావడంతో మూడో రోజు భారీగా వసూళ్లు సాధించింది.
కలెక్షన్స్ ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా 'మిరాయ్' మూవీ మూడో రోజులకు కలిపి రూ.81.2 కోట్ల గ్రాస్ వచ్చినట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్‌గా పోస్టర్ రిలీజ్ చేసింది. ఫస్ట్ డే రూ.27.20 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... రెండో రోజు రూ.55.60 కోట్ల వసూళ్లు సాధించింది. ఆదివారం రూ.16 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. తెలుగులో రూ.12.30 కోట్లు, తమిళం నుంచి రూ.20 లక్షలు, మలయాళం నుంచి రూ.5 లక్షల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు వెల్లడించాయి.
వీకెండ్ కావడంతో కలెక్షన్స్ భారీగా పెరగ్గా... సోమవారం అది కాస్త తగ్గే ఛాన్స్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే రూ.100 కోట్లకు చేరువ కానుండగా... ఈ వారం కూడా థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏమీ లేవు. దీంతో ఇదే జోష్ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఇక వచ్చే వారం పవన్ కల్యాణ్ 'OG' మూవీ రిలీజ్ కానుండడంతో ఆ ఇంపాక్ట్ కూడా 'మిరాయ్' కలెక్షన్లపై పడే ఛాన్స్ ఉంది. ఇంతలోపు 'మిరాయ్' ఎంత కలెక్షన్స్ సాధిస్తుందో చూడాల్సి ఉంది. నెక్స్ట్ వీకెండ్‌లో రికార్డు కలెక్షన్స్ సాధించే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: మహేష్ 'SSMB29' బిగ్గెస్ట్ అడ్వెంచర్ కోసం బిగ్ సెట్... హైదరాబాద్‌లో ఫేమస్ టెంపుల్ క్రియేట్ చేస్తారా?
వీఎఫ్ఎక్స్‌కు ఫిదా
ముఖ్యంగా 'మిరాయ్'లో వీఎఫ్ఎక్స్ వర్క్స్‌కు పిల్లల నుంచి పెద్దల వరకూ ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. సినీ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో బెస్ట్ అవుట్ పుట్ గ్రాండియర్ లుక్ ఇచ్చారంటూ డైరెక్టర్ కార్తీక్‌ను ప్రశంసిస్తున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్, యుద్ధ సన్నివేశాలు అదిరిపోయాయి.
తేజ సరసన రితికా నాయక్ హీరోయిన్‌గా చేశారు. వీరితో పాటు శ్రియ, జగపతిబాబు, జయరామ్, గెటప్ శ్రీను, కిషోర్ తిరుమల, వెంకటేష్ మహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ సంయుక్తంగా మూవీని నిర్మించారు.