'మత్తు వదలరా' నుంచి 'వికటకవి' & 'పరువు' వెబ్ సిరీస్‌లు... లేటెస్ట్ థియేట్రికల్ రిలీజ్ 'గుర్రం పాపిరెడ్డి' వరకు... యంగ్ హీరో నరేష్ అగస్త్య తన ట్యాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడీ హీరో మరో కొత్త సినిమాతో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. 'మరొక్కసారి' (Marokkasari Movie) అంటూ సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
దక్షిణాది భాషల్లో 'మరొక్కసారి'నరేష్ అగస్త్య (Naresh Agastya) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'మరొక్కసారి'. ఇందులో సంజనా సారథి హీరోయిన్. సీకే ఫిల్మ్ మేకర్స్ పతాకంపై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నితిన్ లింగుట్ల రచయిత - దర్శకుడు. సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం... ఈ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కేరళలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పాటు టిబెట్ సరిహద్దు సమీపంలో అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన గురుడోంగ్మార్ సరస్సు దగ్గర సినిమా షూటింగ్ చేశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఆ సరస్సు దగ్గర చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా 'మరొక్కసారి' నిలిచిందని వివరించారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వర్క్ జరుగుతోందని, సినిమాకు కావాల్సిన పూర్తి విజువల్ టోన్ అందించేందుకు ఫైనల్ కలర్ గ్రేడింగ్, విజువల్ ఫినిషింగ్ పనులు చేస్తున్నామని తెలిపారు నిర్మాత బి.చంద్రకాత్ రెడ్డి.
Marokkasari Movie Cast: నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నటించిన 'మరొక్కసారి' సినిమాలో బ్రహ్మాజీ, సుధర్షన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: సీకే ఫిల్మ్ మేకర్స్, నిర్మాత: బి. చంద్రకాంత్ రెడ్డి, రచన - దర్శకత్వం: నితిన్ లింగుట్ల, కూర్పు: చోటా కే ప్రసాద్, సంగీతం: భరత్ మాంచిరాజు, ఛాయాగ్రహణం: రోహిత్ బచు.
