Manchu Vishnu About His Father And Kannappa Release: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. తాజాగా.. ఓ పాడ్ కాస్ట్‌లో మంచు విష్ణు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నా తండ్రి సంతోషమే నాకు ముఖ్యం
తన తండ్రి సంతోషమే తనకు ముఖ్యమని.. ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు కానీ ఆయనకు చెడ్డపేరు తీసుకురాకూడదని మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. 'ఇటీవల ఎదురైన పరిస్థితుల వల్ల నేను చాలా బాధపడ్డాను. బాధ అంటే కూడా చాలా చిన్న పదం అవుతుంది. ఇప్పుడు నేను దేని గురించీ ఆలోచించడం లేదు. మా నాన్న సంతోషంగా ఉండాలి. ఆయన పడిన కష్టానికి నేను ఆయనకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు. కానీ.. చెడ్డ పేరు మాత్రం తీసుకురాకూడదు.
ఒకవేళ అలా చెడ్డ పేరు తీసుకొస్తే.. ఆ రోజు నేను ఓ కొడుకుగా బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. నేనంటూ ఉన్నంత వరకూ ఆయన చాలా హ్యాపీగా ఉండాలి. నేను పూర్తిగా శివభక్తుడిగా మారి ఆయన ధ్యానం చేసుకుంటూ పాజిటివ్‌గా ఉండగలుగుతున్నా.' అని అన్నారు.
Also Read: ఒకట్రెండు అయితే లెక్కపెట్టవచ్చు... టిక్ టాక్ వీడియోలు ఎన్నో - రమ్య మోక్షను గుర్తు పట్టగలరా?
కన్నప్ప బడ్జెట్‌పై
కన్నప్ప మూవీ నుంచి ఫస్ట్ లుక్స్, సాంగ్స్ రిలీజ్ అయితే.. కొంతమంది కావాలని పని గట్టుకుని ట్రోల్ చేశారని మంచు విష్ణు అన్నారు. అసలు సినిమా ఎలా ఉంటుందో తెలియకుండానే ఇందులోని సీన్స్ తప్పుపడుతూ సెన్సార్ బోర్డుకు లెటర్స్ రాశారని చెప్పారు. 'అది తెలిసిన వాళ్లకు మన చరిత్ర తెలియదని నవ్వుకున్నాను.
శ్రీకాళహస్తిలోని అర్చకులందరికీ 'కన్నప్ప'ను చూపించి ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పాలని అడిగాం. వారు ఒక్క ఫ్రేమ్ కూడా మార్చొద్దని అన్నారు. 'భక్తి అంటే ఏంటో ఇందులో చూపించారు.' అని ప్రశంసించారు. అదే నా బలం. ఈ మూవీ కోసం అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఖర్చు చేశాను. ఎంత అనేది మాత్రం రివీల్ చేయను.' అని విష్ణు తెలిపారు.
ప్రభాస్‌పై ప్రశంసలు
ఈ సందర్భంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు మంచు విష్ణు. తాను, ప్రభాస్ చాలా క్లోజ్ అని.. ప్రభాస్‌లా చాలా తక్కువ మంది ఉంటారని చెప్పారు. ఇంత పెద్ద స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని అన్నారు. 'ప్రభాస్, నేను ఎప్పటికీ సోదరులమే. రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఈ రోజు నా పతనం కోరుకునేటప్పుడు.. నేను, ప్రభాస్ రక్తం పంచుకుని పుట్టకపోయినా నా మంచి కోరుకుంటున్నాడు. అందుకే ఎన్ని జన్మలకైనా అతనికి రుణపడి ఉంటాను.' అని అన్నారు.
'కన్నప్ప' మూవీని 2 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని.. ఈ స్థాయిలో రిలీజ్ అవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని విష్ణు అన్నారు. తనకంటే ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న వారు చాలామంది ఉన్నారని.. ఇండియాలో గుర్తింపు పొందిన 200 మంది నటుల్లో తాను ఒకడినని చెప్పారు.