మంచు లక్ష్మి ముఖ్య పాత్రలో నటించిన 'అగ్ని నక్షత్రం' సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్‌ లుక్, గ్లింప్స్‌ వచ్చిన విషయం తెల్సిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ''తెలుసా తెలుసా'' అనే పాటను విడుదల చేశారు. సమంత చేతుల మీదుగా ఈ పాటను విడుదలైంది.  మంచు లక్ష్మి పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌ తో క్లారిటీ వచ్చేసింది. ఈ పాటలో కూడా ఆమె పాత్ర పవర్ ను చూపించే ప్రయత్నం చేశారు. అచ్చు రాజమణి స్వరపరచిన పాటను సునీత సారథి, శిరీష భగవతుల, అదితి భావరాజు ఆలపించారు. మహిళా గొప్పతనం చూపించే విధంగా ఈ పాట సాహిత్యాన్ని కాసర్ల శ్యామ్‌ అందించారు. ఈ పాటలో మంచు లక్ష్మి లుక్, బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టింది. ఈ పాటలో ఆమె కూతురు విద్యా నిర్వాణ కూడా కనిపించింది.


మంచు లక్ష్మి కొన్ని కారణాల వల్ల కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి... మళ్లీ ఈ చిత్రంతో తన జోరును కంటిన్యూ చేయాలని భావిస్తోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వంలో మోహన్‌ బాబుతో కలిసి ఈమె స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ పాటలో మంచు లక్ష్మి డాన్స్, స్టంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆమె ఈ పాట కోసం కాస్త ఎక్కువగానే కష్టపడ్డట్లుగా కనిపిస్తుంది. కానీ  అచ్చు రాజమణి అందించిన మ్యూజిక్ పెద్దగా మెప్పించలేక పోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


వేసవి కానుకగా అగ్ని నక్షత్రం..



తండ్రి మోహన్‌ బాబుతో కలిసి మంచు లక్ష్మి  మొదటి సారి వెండి తెరపై ఈ సినిమాలో కనిపించబోతున్నారు. తండ్రి కూతురు కలిసి నటిస్తున్న ఈ సినిమా విడుదల కోసం మంచు అభిమానులు ఎదురు చూస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా పోస్టర్స్‌.. గ్లింప్స్‌ విడుదల చేయడంతో ఆసక్తి పెరుగుతోంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ వేసవిలోనే 'అగ్ని నక్షత్రం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.  సముద్రఖని కీలక పాత్రలో నటిస్తుండగా జబర్దస్త్‌ మహేష్‌, చైత్ర శుక్లా, విశ్వంత్‌ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కథ ఒక మర్డర్‌ కేసు చుట్టూ తిరుగుతుంది. ఇందులో మంచు లక్ష్మి పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. 


ఇటీవల మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. అయితే ‘అగ్ని నక్షత్రం’ తప్పకుండా హిట్ కొడుతుందనే ఆశతో ఉన్నారు. ''తెలుసా తెలుసా'' పాటతో సినిమాకి పబ్లిసిటీ మరింత దక్కింది. మంచు లక్ష్మి తన సినిమాను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా గ్యాప్ తీసుకుని మంచు లక్ష్మి చేసిన ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.