Sharwanand's Maname OTT Release On Amazon Prime Video: మూవీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ అటు ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ఇటు యూత్‌ను సైతం ఎంటర్‌టైన్ చేస్తుంటారు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand). ఆయన లీడ్ రోల్ చేసిన ఫ్యామిలీ డ్రామా 'మనమే' (Maname). దాదాపు ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈ నెల 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 'మనమే' సినిమాను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించగా.. మూవీలో శర్వానంద్ సరసన యంగ్ హీరోయిన్ కృతిశెట్టి (Krithi Shetty) నటించారు. గతేడాది జూన్ 7న మూవీ రిలీజ్ కాగా ఇప్పటివరకూ ఓటీటీలోకి రాలేదు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించగా.. హీషం అబ్దుల్ వహాద్ సంగీతం అందించారు. సినిమాలో రాహుల్ రవీంద్రన్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషించారు.






కథేంటంటే..?


గతేడాది జూన్ 7న థియేటర్లలోకి వచ్చిన 'మనమే' (Maname) బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇక కథ విషయానికొస్తే.. విక్రమ్ (శర్వానంద్) గాలికి తిరుగుతూ ఎలాంటి బాధ్యత లేకుండా అలా సరదాగా గడిపేస్తుంటాడు. అతని ప్రాణ స్నేహితుడు అనురాగ్ (త్రిగుణ్), అతని భార్య శాంతి ప్రమాదంలో చనిపోతారు. ఇదే సమయంలో వారి కొడుకు ఖుషీని విక్రమ్, సుభద్ర (కృతిశెట్టి) పెంచాల్సి వస్తుంది. వీరిద్దరూ పెళ్లి కాకుండానే ఖుషీ కోసం పేరెంట్స్‌గా మారతారు. బాధ్యత లేని విక్రమ్, అన్నీ పర్‌ఫెక్ట్‌గా చూసుకునే సుభద్ర కలిసి పిల్లాడిని ఎలా పెంచారు..?. ఖుషి వచ్చాక వారి జీవితంలో జరిగిన పరిణామాలేంటి..? అసలు, జోసెఫ్ (రాహుల్ రవీంద్రన్), కార్తీక్ (శివ కందుకూరి) ఎవరు.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.


Also Read: యువతులకు మెసేజెస్ అంటూ ప్రచారం - నటుడు మాధవన్ క్లారిటీ, అసలు ఏం జరిగిందో తెలుసా?


హీరో శర్వానంద్‌ ఖాతాలో చాలాకాలంగా మంచి హిట్ పడలేదు. ఇటీవల ఆయన తన సినిమాలకు డిఫరెంట్ టైటిల్స్‌తో ప్రేక్షకుల  ముందుకు వస్తున్నారు. శర్వా హీరోగా రామ్ అబ్బరాజు దర్శకుడిగా వస్తోన్న లేటెస్ట్ మూవీకి 'నారీ నారీ నడుమ మురారీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మూవీలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న సినిమాకు బాలయ్య సినిమా టైటిల్ ఫిక్స్ చేయడంతో ఆసక్తి నెలకొంది. అలాగే, అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన మరో మూవీకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'జానీ' టైటిల్‌ను పెట్టుకోబోతున్నట్లు సమాచారం. శర్వా హీరోగా యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో శర్వానంద్‌కు తండ్రి పాత్రలో సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్నట్లు సమాచారం. పవన్ సినిమా టైటిల్ పెడుతున్నందుకు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Also Read: చిరంజీవి ‘అన్నయ్య’, పవన్ ‘తమ్ముడు’ to మహేష్ ‘నిజం’, రామ్ చరణ్ ‘బ్రూస్‌లీ’ వరకు - ఈ సోమవారం (మార్చి 3) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్