మలయాళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ (Ranjith Balakrishnan)ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. కొచ్చిలోని ఎర్నాకుళంలో ఈ అరెస్ట్ జరిగింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఓ సినిమా సెట్‌లో తనను రంజిత్ బాలకృష్ణన్ లైంగికంగా వేధించారని ఓ యువ నటి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
అరెస్టుకు ముందు ఏం జరిగింది?అసలు కేసు పూర్వాపరాలు ఏమిటి?ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఒక సినిమా సెట్‌లో తనతో రంజిత్ బాలకృష్ణన్ అనుచితంగా ప్రవర్తించారని ఓ నటి ఆరోపించారు. ఆరోపణలు వచ్చిన తర్వాత సినిమాకు సంబంధించిన అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు వెళ్ళింది. ఆ కమిటీ ప్రాథమిక విచారణ చేసిన తర్వాత... ఇది తీవ్రమైన చర్య అని, తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా కేసును కేరళ పోలీసులకు బదిలీ చేసింది. అరెస్ట్ ముందు వరకు విచారణ అంతటినీ గోప్యంగా ఉంచారు. అయితే కొన్నేళ్లుగా ఆయన దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. నటుడిగా బిజీ అయ్యారు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ముందుకు వెళుతున్నారు. నటుడిగా చేస్తున్న ఓ సినిమా సెట్‌లో యువ నటిని వేధించినట్టు టాక్.
రంజిత్ బాలకృష్ణ అరెస్ట్ ఎక్కడ జరిగింది?ఎర్నాకుళంలోని తోడుపుళాలో స్థానిక అధికారుల సహాయంతో రంజిత్ బాలకృష్ణన్ అరెస్ట్ కార్యక్రమాన్ని ఎటువంటి హడావుడి లేకుండా ఎర్నాకుళం సెంట్రల్ పోలీసులు పూర్తి చేశారు. ఓ కార్యక్రమం కోసం రంజిత్ వెళుతున్న సమయంలో... ఆయన కారును పోలీసులు అడ్డగించారు. ప్రజలకు అంతరాయం కలగకుండా ఈ అరెస్టు అత్యంత రహస్యంగా నిర్వహించారు. మొదట స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్లి, అనంతరం తదుపరి విచారణ కోసం ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Also Read: Tovino Thomas: ఎన్టీఆర్ - నీల్ 'డ్రాగన్'లో నటించడం లేదు... కన్ఫర్మ్ చేసిన మలయాళ స్టార్ టోవినో థామస్
రెండు సంవత్సరాల క్రితం రంజిత్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఓ బెంగాలీ నటి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను రంజిత్ ఖండించారు. తనను పదవి నుంచి తప్పించి, తొలగించడానికి ఒక వర్గం ప్రయత్నిస్తోందని ఎదురు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రంజిత్ బాలకృష్ణన్ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.
