బాలీవుడ్ కండల వీరుడు - స్టార్ హీరో సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకున్నప్పటి నుంచి మలైకా అరోరా (Malaika Arora) వ్యక్తిగత జీవితం ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నిర్మాత బోనీ కపూర్ తనయుడు, యువ కథానాయకుడు నటుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor)తో ఆమె రిలేషన్‌షిప్, బ్రేకప్ వ్యవహారం ప్రజల దృష్టిని బాగా ఆకర్షించింది. అప్పటి నుండి మలైకా ఎవరితో కనిపించినా సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్‌తో బ్రేకప్ అయిన రెండేళ్ళకు తమ సంబంధం గురించి మనసు విప్పి మాట్లాడింది మలైకా అరోరా. ప్రజలు తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించేటప్పుడు ఎలా 'అతిగా తొంగి చూస్తారో' కూడా ఆమె వివరించింది.
అర్జున్ కపూర్ గురించి మలైకా అరోరా ఏమన్నారంటే? నమ్రతా జకారియా షోలో అర్జున్ కపూర్ గురించి మలైకా అరోరా మాట్లాడుతూ... “కోపం, బాధ జీవితంలో ఒక నిర్దిష్ట దశలో వస్తాయి. ఇది ప్రతి ఒక్కరికీ జరుగుతుందని నేను భావిస్తున్నాను. మనం మనుషులం... మనమంతా కోపం, నిరాశలతో ప్రయాణిస్తాం. ఇది మానవ స్వభావం. కానీ కాలం గడిచేకొద్దీ... ఆ కాలమే అన్నింటినీ నయం చేస్తుంది” అని తెలిపారు.
ఇంకా మలైకా అరోరా మాట్లాడుతూ... “ఏది ఏమైనప్పటికీ అర్జున్ కపూర్ నాకు చాలా ముఖ్యమైన వ్యక్తి. నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అని నేను భావిస్తున్నాను. ఏమి జరిగినా... నేను నా గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా మాట్లాడకూడదని అనుకుంటున్నాను. నా లైఫ్ గురించి చాలా రాశారు. ప్రతిచోటా చాలా ప్రచారం చేశారు. ఒక విధంగా ఇది మీడియాకు మసాలాగా మారింది” అని అన్నారు.
ఇప్పుడు మలైకా వయసు 52 ఏళ్ళు. ఆమె మాట్లాడుతూ... “సెలబ్రిటీలు తుమ్మినా దగ్గినా, ఎక్కడికి వెళ్లినా ఏదైనా వార్త అవుతుంది. ప్రతి ఒక్కరికీ దానిని యాక్సెస్ చేసే అవకాశం ఉంది. నా సంబంధాల గురించి ఎల్లప్పుడూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచాయి. అది చాలా ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు నేను ఏదైనా నిరూపించాల్సిన అవసరం లేదు” అని అన్నారు.
మిస్టరీ మ్యాన్ గురించి మలైకా ఏమన్నారంటే?అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరాతో మిస్టరీ మ్యాన్ తో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. వాటి గురించి అడిగినప్పుడు మలైకా మాట్లాడుతూ “మీరు ఎవరితోనైనా కనిపిస్తే, మీరు బయటకు వెళితే ఒక పెద్ద సమస్య అవుతుంది. నేను ఈ విషయాలను అనవసరంగా పెంచకూడదనుకుంటున్నాను. వాటిని మరింత చేయకూడదనుకుంటున్నాను. ఎందుకంటే దాని వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నేను ఎప్పుడు బయటకు వెళ్లినా... నాతో ఎవరున్నా... పాత స్నేహితుడైనా, స్వలింగ సంపర్కుడైనా, వివాహితుడైనా, మేనేజర్ లేదా మరెవరైనా నన్ను వెంటనే ఆ వ్యక్తితో ముడిపెడతారు. వాటిని చూసి నవ్వుకుంటాం. జోకులు వేసుకుంటాం. నా తల్లి ఫోన్ చేసి ‘ఇతను ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు?’ అని అడుగుతుంది” అన్నారు.