''గతంలో ఏదైనా ఒక సభ నిర్వహిస్తున్నామని చెబితే... ఎక్కడెక్కడి నుంచో తండోప తండాలుగా ప్రజలు వచ్చేవారు. పాల్గొని విజయవంతం చేసేవారు. ఇప్పుడు ఏ సభ అయినా నిర్వహిస్తే... మూడు 'బీ'లు సమకూర్చాలి అంటున్నారు. మూడు 'బీ'లు అంటే... బస్సు, బిర్యానీ, బాటిల్‌! ఆ మూడు ఉంటేనే సమావేశాలకు హాజరు అవుతున్నారు. ఇటువంటి మాటలు వింటుంటే మన దేశం ఎక్కడికి పోతుంది? అని బాధ కలుగుతుంది'' అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వ్యాఖ్యానించారు. 


'స్వాతంత్రోద్యమం - తెలుగు సినిమా - ప్రముఖులు' పుస్తక ఆవిష్కరణోత్సవానికి ఎం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. సంజయ్ కిషోర్ (Sanjay Kishore) సేకరణ, రచనలో ఆ పుస్తకం రూపొందింది. పుస్తకాన్ని విడుదల చేసిన అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ''మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉంది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న తెలుగు సినిమా ప్రముఖులు, అప్పటి పరిస్థితులు, సినిమాల గురించి పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ చక్కటి విశ్లేషణ చేశాడు. ప్రస్తుత సమాజానికి ఈ తరహా పుస్తకాలు ఎంతో అవసరం. ఇటువంటి మంచి పుస్తకాన్ని వీడియో రూపంలో తీసుకురావటానికి ప్రయత్నించమని సంజయ్‌ కిశోర్‌ని కోరుతున్నా'' అని అన్నారు. ''సాంకేతికంగా మనం ఎంత ముందుకు వెళ్లినా... గుల్‌(Google)ను రిపేర్‌ చేయాలన్నా గురువే కావాలి'' అంటూ గురువు యొక్క గొప్పతనాన్ని ఆయన వివరించారు. 


కేవీ రమణాచారి సలహాతో... 
పుస్తక రచయిత సంజయ్‌ కిశోర్‌ మాట్లాడుతూ ''ఓ సందర్భంలో కేవీ రమణాచారి గారిని కలిశా. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం 'ఆజాదికా అమృత్‌ మహోత్సవ్‌' కార్యక్రమం చేస్తున్నదని, నన్ను కూడా ఏదైనా చేయమని చెప్పారు. నాకు సినిమాపై నాలెడ్జ్‌ ఉండటంతో ఆరు నెలల్లో స్వాతంత్య్రంలో పాల్గొన్న మన సినిమా పెద్దల గురించి రాద్దామని అనుకుని ఈ పుస్తక ప్రయాణం మొదలు పెట్టాను. పూర్తి చేయడానికి దాదాపు ఏడాదిన్నర కాలం పట్టింది. ఈ పుస్తక రూపకల్పనలో నేను ఏ కార్యక్రమం చేసినా నన్ను నమ్మి ఆర్ధిక సాయం చేసే కిమ్స్‌ అధినేత బొల్లినేని కృష్ణయ్య గారు, సదరన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ అధినేత రాజశేఖర్‌ గారు సాయం చేశారు. వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది''  అని చెప్పారు. 


Also Read 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?


మనం మంచి చేయమని ఎంతో మంది చెప్పినా... విని ఆచరించే సంజయ్‌ కిశోర్‌ లాంటి వాళ్లు కొందరే ఉంటారని కేవీ రమణాచారి తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమలోని ఎంతమంది గొప్పవారి గురించి అతను అనేక మంచి విషయాలు పుస్తకంలో రాశారని ఆయన వివరించారు. ''ఈ పుస్తకంలో బి. విఠలాచార్య గారి గురించి, అల్లు రామలింగయ్య గారి గురించి రాసిన విషయాలు తెలుసుకుని ఆశ్యర్యపోయాను'' అని దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండలి బుద్ధ ప్రసాద్‌, కిమ్స్‌ అధినేత బొల్లినేని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. 


Also Read : అల్లు అర్జున్ మాస్ - ఒక్క లుక్కుతో రికార్డులు క్రియేట్ చేసిన పుష్పరాజ్