Lokesh Kanagaraj Movie With Aamir Khan: 'విక్రమ్', 'లియో' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. ఆయన ప్రస్తుతం తమిళ స్టార్ రజినీ కాంత్‌తో 'కూలీ' మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో లోకేశ్ తర్వాత ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొనగా.. ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. 

బాలీవుడ్ స్టార్‌తో మూవీ

'కూలీ' ప్రాజెక్ట్ తర్వాత లోకేశ్ కనగరాజ్ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో మూవీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమిర్.. 'సితారే జమీన్ పర్' మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ తాజా ఇంటర్వ్యూలో లోకేశ్‌తో మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. 'లోకేశ్ కనగరాజ్‌తో మీరు మూవీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిలో నిజమెంత?' అని ప్రశ్నించగా.. 'అవును నిజమే. ఆయనతో ఓ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం దాని పనుల్లోనే ఇద్దరం బిజీగా ఉన్నాం.

సూపర్ హీరో జానర్‌లో ఈ మూవీ స్టోరీ ఉంటుంది. భారీ యాక్షన్ మూవీగా ఇది రూపొందనుంది. వచ్చే ఏడాది జూన్ తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి ఈ మూవీ గురించి ఏమీ చెప్పలేను. రెండేళ్ల తర్వాత ఈ మూవీ గురించి మాట్లాడుకుందాం.' అంటూ ఆమిర్ అధికారికంగా వెల్లడించారు.

ఈ నెల 20న 'సితారే జమీన్ పర్'

ఇక ఆమిర్ ఖాన్ లేటెస్ట్ మూవీ 'సితారే జమీన్ పర్' ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాస్కెట్ బాల్ కోచ్‌గా పేరొందిన గుల్షన్ (ఆమిర్ ఖాన్) మానసికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న కొంతమందిని ప్లేయర్స్‌గా తీర్చిదిద్దాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి?, వాళ్లకు ఎలా శిక్షణ ఇచ్చాడు? అనేదే ఈ మూవీ కథాంశం.

ఇతర ప్రాజెక్టుల్లోనూ బిజీగా..

ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతోనూ బిజీగా ఉన్నారు. 'దాదా సాహెబ్ ఫాల్కే' బయోపిక్ తీసేందుకు ఆయన రెడీ అవుతున్నారు. రాజ్ కుమార్ హిరాణీ, తాను ఆ పనుల్లో బిజీగా ఉన్నట్లు చెప్పారు ఆమిర్. ఇటీవలే దీనిపై దాదాసాహెబ్ మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. ఆమిర్ ఖాన్ టీం తనను ఎన్నోసార్లు సంప్రదించినట్లు చెప్పారు. 'సితారే జమీన్ పర్' మూవీ తర్వాత ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Also Read: వెకేషన్‌లో సమంత - నేచుర్‌తో ఎంజాయ్ చేస్తోందిగా..

ఇక 'పీకే 2' మూవీ పట్టాలెక్కుతుందనేది కేవలం ప్రచారం మాత్రమేనని.. ఆ ప్రాజెక్ట్ గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని తాజా ఇంటర్వ్యూలో ఆమిర్ క్లారిటీ ఇచ్చారు. అలాగే.. 'మహాభారతం' ప్రాజెక్ట్ తన 25 ఏళ్ల డ్రీమ్ అని.. అది కేవలం సినిమా మాత్రమే కాదని.. ఓ యజ్ఞంలా ఎంతో క్రమశిక్షణతో చేయాలని చెప్పారు. అందుకు అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయన్న ఆయన.. ఆ కల నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉందంటూ పేర్కొన్నారు.

మరోవైపు.. లోకేశ్ కనగరాజ్ మూవీస్ విషయానికొస్తే.. రజినీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన మూవీ 'కూలీ' ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు డైరెక్టర్‌గానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు లోకేశ్. రాఘవ లారెన్స్ హీరోగా 'బెంజ్' మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బక్కియరాజ్ కన్నన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.