'లైగర్' సినిమా (Liger Movie) రిజల్ట్ ఏంటనేది ఎవరికి అయినా సరే ప్రత్యేకంగా వివరించాల్సిన పని లేదు. అంత డిజాస్టర్ అవుతుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ప్రతి ఒక్కరూ హిట్ సినిమా చేయాలని కష్టపడతారు. కానీ, కొన్నిసార్లు ఫలితం అనుకున్నట్లు రాకపోవచ్చు. 'లైగర్' విషయంలో అదృష్టం కలిసి రాలేదని సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ సరిపెట్టుకుని ఉండొచ్చు. 


ఎవరైనా సరే భారీ డిజాస్టర్ వచ్చినప్పుడు, దాన్ని మర్చిపోయి కొత్త సినిమాపై దృష్టి పెట్టాలని చూస్తారు. బ్లాక్ బస్టర్ సినిమా అందించడానికి ట్రై చేస్తారు. 'లైగర్' హీరో, దర్శక నిర్మాతలు ఆ సినిమాను మర్చిపోవాలని చూసినా కుదరడం లేదు. ఏదో ఒక రూపంలో మళ్ళీ మళ్ళీ గాయాన్ని గుర్తు చేస్తోంది. డబ్బులు విషయంలో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్‌కు, డిస్ట్రిబ్యూటర్ & ఫైనాన్సియర్లకు మధ్య ఎంత గొడవ అయ్యిందో ప్రేక్షకులకు, సాధారణ ప్రజలకు కూడా తెలుసు. ఆ గొడవలో హీరో విజయ్ దేవరకొండను డిస్ట్రిబ్యూటర్లు వదిలేసినా... ఈడీ వదల్లేదు. 


'లైగర్' నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు!?
డిస్ట్రిబ్యూటర్లు & ఫైనాన్సియర్‌తో గొడవ సద్దుమణిగిందని పూరి జగన్నాథ్ రిలాక్స్ అయ్యేలోపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయ్యింది. 'లైగర్' చిత్ర నిర్మాణంలో ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఓ రాజకీయ నాయకుడి ప్రమేయంతో దుబాయికి డబ్బులు పంపించి, అక్కడి నుంచి సినిమాలో పెట్టుబడులు పెట్టించినట్టు ఈడీ అధికారులు గతంలో ప్రాథమికంగా గుర్తించారు. ఆ విషయమై దర్శకుడు, చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి పూరి జగన్నాథ్, నిర్మాతలలో మరొకరు అయిన ఛార్మీలను గతంలో విచారించారు. ఈ రోజు విజయ్ దేవరకొండను విచారించారు. 


'ఆచార్య'కు అలా...
లైగర్'కు మరోలా!
'ఆచార్య' సినిమా డిజాస్టర్ అయినప్పుడు తమ నష్టాలను భర్తీ చేయాలని కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు హీరో చిరంజీవికి సందేశాలు పంపించారు. హీరో రెస్పాండ్ కావాలని కోరారు. కానీ, 'లైగర్' విషయంలో ఆ విధంగా ఎవరూ చేయలేదు. పూరి జగన్నాథ్ ఇంటి ముందు ధర్నా చేయాలని ప్లాన్ చేశారు గానీ హీరో విజయ్ దేవరకొండను ఎవరూ పల్లెత్తు మాట అనలేదు. అసలు ఆ గొడవలో ఎక్కడా హీరో పేరు రాలేదు. 


'లైగర్' సినిమాకు విజయ్ దేవరకొండ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? ఫ్లాప్ అయిన తర్వాత ఎంత వెనక్కు ఇచ్చారు? అనేది బయటకు రాలేదు. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతలు ఆయనకు ఎక్కువ ఇస్తారా? ఏంటి? అనే క్వశ్చన్ రావచ్చు. డిస్ట్రిబ్యూటర్లను పూరి జగన్నాథ్ ప్రశ్నించినట్టు ఓవర్ ఫ్లోస్ వస్తే విజయ్ దేవరకొండకు ఇవ్వరని చెప్పవచ్చు. 


'లైగర్' డిజాస్టర్ ప్రభావం విజయ్ దేవరకొండ ఇమేజ్ మీద ఎంత పడుతుందనేది పక్కన పెడితే... ఆ సినిమా తర్వాత పూరితో చేయాలనుకున్న 'జన గణ మణ' క్యానిల్ చేసినందుకు ఆ నిర్మాతలకు మరో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. ఎందుకంటే? ఆల్రెడీ 'జన గణ మణ' మీద కొంత అమౌంట్ ఖర్చు పెట్టారు కాబట్టి ఆ నష్టాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలిపాయి. 


Also Read : పెళ్ళి ఫోటోలు చూసుకోవాల్సిన టైమ్‌లో స్మశానానికి - అమెరికన్ సింగర్ మృతి