Lal Salaam Release Date: 2024 సంక్రాంతి రేసులో నిలబడడానికి ఎన్నో సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలకు పోటీగా పలువురు యంగ్ హీరోలు కూడా తమ కంటెంట్ మీద నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సంక్రాంతి అంటే సినిమాల పండగ అని దాదాపు ప్రతీ సౌత్ ఇండస్ట్రీ మేకర్స్.. సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తుంటారు. ఈసారి టాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో సినిమాలకు గట్టిపోటీనే జరగనుంది. కానీ ఇంతలోనే సంక్రాంతి రేసు నుంచి సూపర్‌స్టార్ రజినీకాంత్ తప్పుకుంటాడని వార్తలు వైరల్ అయ్యాయి. దానికి కారణం తన మాజీ అల్లుడేనట.


కోలీవుడ్‌లో సంక్రాంతి పండగ..
టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా 2024 జనవరిలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీనే జరగనుంది. తెలుగులో ‘గుంటూరు కారం’, ‘నా సామిరంగ’, ‘ఈగల్’ వంటి చిత్రాలు టాలీవుడ్‌లో సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఇక కోలీవుడ్‌లో కూడా మూడు పెద్ద సినిమాలు సంక్రాంతి పోటీకి సిద్ధంకానున్నాయి. అందులో ఒకటి శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘అయాలన్’, మరొకటి ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘కెప్టెన్ మిల్లర్’, మూడో సినిమా ఐశ్వర్య రజినీకాంత్ నిర్మాణంలో రానున్న ‘లాల్ సలామ్’. అయితే ముందుగా యంగ్ హీరోలతో పోటీపడడానికి రజినీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ను జనవరి 12న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. కానీ విడుదల విషయంలో ఈ మూవీ టీమ్ మనసు మార్చుకుందని సమాచారం. 


మొదటి పాట విడుదల..
తాజాగా ‘లాల్ సలామ్’లోని మొదటి పాటను విడుదల చేసింది మూవీ టీమ్. ‘తేర్ తిరువీరా’ అంటూ సాగే ఈ పాటను శంకర్ మహదేవన్‌తో పాటు ఏఆర్ రైహానా, దీప్తి సురేశ్, యోగి శేఖర్ పాడారు. ఏఆర్ రెహమాన్.. ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. అయితే పాట విడుదలయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఒక అనుమానం మొదలయ్యింది. ముందు అనుకున్నట్టుగా జనవరి 12న ‘లాల్ సలామ్’ విడుదల కాదని, రిలీజ్ డేట్‌ను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారని కోలీవుడ్‌లో రూమర్స్ మొదలయ్యాయి. ‘లాల్ సలామ్’ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ ప్రొడ్యూస్ చేసినా.. అందులో రజినీకాంత్ పాత్ర ఉండేది కాసేపు మాత్రమే. విష్ణు విశాల్, విక్రాంత్‌లు ఈ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఐశ్వర్య రజినీకాంత్ నిర్మాతగా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తోంది. 


మాజీ భర్తతో పోటీ ఇష్టం లేక..
రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ‘లాల్ సలామ్’ నుంచి స్పెషల్ టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఇందులో రజినీకాంత్ ముస్లిం పాత్రలో కనిపించనున్నాడు. ఆయన పోషించే పాత్రకు స్క్రీన్ టైమ్ తక్కువే అయినా.. ఇది కథలో చాలా కీలకం అని మేకర్స్ చెప్తున్నారు. మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ‘లాల్ సలామ్’లో గెస్ట్ రోల్ ప్లే చేశారని సమాచారం. అయితే ఇప్పుడు ‘లాల్ సలామ్’ మూవీ రిలీజ్ డేట్ గురించి కోలీవుడ్‌లో పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ధనుష్ నటించిన ‘కెప్టెన్ మిల్లర్’తో పోటీపడకూడదనే  తన మాజీ భార్య ఐశ్వర్య.. ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేయడానికి సిద్ధమయ్యిందని సమాచారం. 


Also Read: ‘సలార్‘ టీమ్ పై మెగాస్టార్ ప్రశంసల జల్లు, ప్రభాస్ రియాక్షన్ ఏంటో తెలుసా?