ప్రేక్షకులు ఈ మధ్య సినిమాలో ఏదైనా కొత్తదనం ఉండాలి లేదా యూత్‌కు అయినా కనెక్ట్ అయ్యే అంశాలైనా ఉండాలని చూస్తున్నారు. ఈ రెండిటిలో ఏ ఒక్క అంశం సినిమాలో ఉన్నా... అది దాదాపు సక్సెస్ అయినట్టే. అయితే ఈ రోజుల్లో మేకర్స్ కూడా ఎక్కువగా యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలను తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగులో ఉన్న యంగ్ దర్శకుల్లో కొందరు... ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. అలాంటి దర్శకుల్లో ఒకడు తరుణ్ భాస్కర్. ఆ డైరెక్టర్ తెరకెక్కించింది రెండు సినిమాలే అయినా... వచ్చిన క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. అందుకే తరుణ్ భాస్కర్ మూడో చిత్రం ‘కీడా కోలా’ (Keeda Cola Movie) గురించి యూత్ అంతా విపరీతంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వారి ఎదురు చూపులకు బ్రేక్ పెడుతూ.. ‘కీడా కోలా’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్.


‘కీడా కోలా’ టీజర్ అదుర్స్..
తరుణ్ భాస్కర్ దర్శకుడిగా తెరకెక్కించింది రెండు సినిమాలే. అవే ‘పెళ్లిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’. ఈ రెండు సినిమాల్లో కామన్‌గా ఉన్న పాయింట్.. యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండడం. తరుణ్ తెరకెక్కించిన చిత్రాలకు యూత్ ఎంతగా కనెక్ట్ అయ్యారంటే ఇటీవల ‘ఈ నగరానికి ఏమైంది’ విడుదలయ్యి అయిదేళ్లు అవ్వగా మూవీ టీమ్... ఆ మూవీని రీ రిలీజ్ చేసింది. ఆ రీ రిలీజ్‌కు టికెట్స్ విడుదలయిన కొన్ని గంటల్లోనే హౌజ్‌ఫుల్ అవ్వడం చూసి మేకర్స్ సైతం ఆశ్చర్యపోయారు. తరుణ్ భాస్కర్ తన తర్వాత చిత్రం ‘కీడా కోలా’ రిలీజ్ డేట్ ఈ రోజు వెల్లడించారు.


నవంబర్ వరకు ఎదురుచూడాల్సిందే..
‘కీడా కోలా’లో చైతన్య, రాగ్ మయూర్, రవీంద్ర విజయ్, జీవన్, తరుణ్ భాస్కర్‌ (Tharun Bhascker)తో పాటు బ్రహ్మానందం కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి ప్రతీ క్యారెక్టర్‌ను చాలా డిఫరెంట్‌గా పరిచయం చేశాడు తరుణ్. తన ముందు సినిమాలకు సంగీతాన్ని అందించిన వివేక్ సాగర్.. తరుణ్ భాస్కర్ హ్యాట్రిక్ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే విడుదలయిన ‘కీడా కోలా’ టీజర్ చూస్తుంటే ఇదొక క్రైమ్ కామెడీ జోనర్‌కు చెందిన చిత్రమని అర్థమవుతోంది. ఇక ఈ మూవీని థియేటర్లలో చూడాలంటే ప్రేక్షకులు మరికొన్ని నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ‘కీడా కోలా’ విడుదల కోసం నవంబర్ నెలను సెలక్ట్ చేసుకున్నారు మేకర్స్.


రానా దగ్గుబాటి సాయంతో..
వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ‘కీడా కోలా’ నవంబర్ 3న విడుదల కానున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. పైగా కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేసే యంగ్ హీరో రానా దగ్గుబాటి.. ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేయడానికి ముందుకొచ్చాడు. దాదాపు అయిదేళ్ల నుండి తరుణ్ భాస్కర్ తరువాతి చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌ను ఈ వార్త ఫుల్ ఖుషీ చేస్తోంది.






Also Read: వినాశకాలే విపరీత బుద్ధి - 'డెవిల్' నిర్మాతకు దర్శకుడి కాంటర్!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial