Actor Kishore Kumar Fires On PM Modi : ప్రధాని మోదీని విమర్శిస్తూ కాంతార ఫేమ్ కిశోర్ చేసిన పోస్ట్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సామాజిక అంశాలపై తన వాయిస్ రెయిజ్ చేస్తూ... ప్రధానిపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. రీసెంట్‌గా ప్రధాని పార్లమెంట్‌లో చేసిన ప్రసంగంపై ఫైర్ అయ్యారు.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ఇరాన్ - ఇజ్రాయెల్ - అమెరికా యుద్ధం నేపథ్యంలో ప్రజలంతా ఏకతాటిపై ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇంధన కొరత, ఎల్పీజీ సంక్షోభం వంటి రాబోయే విపత్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు. ఈ కామెంట్స్‌పై నటుడు కిశోర్ విమర్శలు గుప్పించారు.
'ఇంకెన్ని సవాళ్లు ఎదుర్కోవాలి'
దేశాన్ని కుల మతాల వారీగా విభజించి, ప్రజల మధ్య ద్వేషాన్ని నింపిన తర్వాత ఇప్పుడు 'మళ్లీ అందరం కలిసి ఒకే దేశం'గా ఉండాలని కోరడంపై కిశోర్ ఘాటుగా స్పందించారు. 'దేశాన్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులుగా విభజించి మనం మళ్లీ ఎన్నటికీ ఏకం కాలేనంతగా చేసిన తర్వాత మళ్లీ ఇలా అడుగుతారా?. మీ రాజీలు, లొంగుబాట్ల వల్ల మేము ఇంకా ఎన్ని సవాళ్లు ఎదుర్కోవాలి?. మీ తప్పులను రహస్యాలను కప్పి పుచ్చడానికి మేము ఇంకెంత మూల్యం చెల్లించాలి?. 'మీరు యుద్ధ నేరగాళ్లకు అండగా నిలుస్తారు' అని అంటూ ఆ నర హంతకుడిని కౌగిలించుకోవడానికి వెళ్లే ముందు మమ్మల్ని అడిగారా?.
రాఫెల్ నుంచి ఎప్‌స్టీన్ వరకూ, పెద్ద నోట్ల రద్దు నుంచి కరోనా లాక్ డౌన్ వరకూ, వ్యవసాయ చట్టాల నుంచి అగ్నివీర్ వరకూ, మణిపూర్ నుంచి కాశ్మీర్ లేదా లడఖ్ వరకు మీ పిచ్చి నిర్ణయాలు తీసుకునే ముందు, మమ్మల్ని కానీ, ప్రతిపక్షంలో మా ప్రతినిధులను కానీ, లేదా మా పన్నులతో జీతాలు చెల్లించే మీ సొంత అధికారులను కానీ అడిగారా? మీ రాజీలు, లొంగుబాటు, మూర్ఖత్వం ఫలితంగా వచ్చిన సవాళ్లను ఎదుర్కోమని అడగడానికి మీకు ఏ హక్కు ఉంది? చాలు కరోనా టైంలో గొర్రెల మందలా చావడానికి మేము సిద్ధంగా లేము. మీ లెక్కల్లో మమ్మల్ని 50 లక్షల మందిని చనిపోయిన వారిగా కూడా పరిగణించలేం. అత్యున్నత పదవిని అపహాస్యం చేసిన వారు ఇక వెళ్లిపోవాల్సిన టైం వచ్చింది.' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ అటు పొలిటికల్ పరంగా ఇటు ఇండస్ట్రీ పరంగా సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి.
Also Read : చాముండి టెంపుల్ దర్శించి సారీ చెబుతా - కాంతార దేవతలపై కామెంట్స్ కాంట్రవర్సీ... ధురంధర్ హీరో ఏమన్నారంటే?
కాంతారలో ఫారెస్ట్ ఆఫీసర్ రోల్‌లో ఫుల్ ఫేమ్ సంపాదించుకున్నారు కిశోర్. తెలుగుతో పాటు కన్నడ, తమిళ మూవీస్‌లో నటించారు. తెలుగులో హ్యాపీ, పిస్తా, ఓంశాంతి, భీమిలి కబడ్డీ జట్టు, దమ్ము, కృష్ణం వందే జగద్గురుమ్, దళం, కార్తికేయ, చందమామ కథలు, రౌడీ తదితర మూవీస్‌లో నటించారు.
