కన్నడ సూపర్ స్టార్, సీనియర్ కథానాయకుడు శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) ఈ రోజు అభిమానులు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏమిటంటే... క్యాన్సర్ నుంచి ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయం చెబుతూ న్యూ ఇయర్ సందర్భంగా ఒక వీడియో విడుదల చేశారు.
డిసెంబర్ 24న అమెరికాలో శివన్నకు సర్జరీ!
తాను ఇప్పుడు క్యాన్సర్ ఫ్రీ అని శివ రాజ్ కుమార్ స్పష్టం చేశారు. డిసెంబర్ 24, 2024న అమెరికాలోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (ఎంసిఐ)లో ఆయనకు బ్లాడర్ క్యాన్సర్ సర్జరీ జరిగింది. అంతకు ముందు క్యాన్సర్ అని తెలిశాక, సర్జరీ జరిగాక ఆయన ఆరోగ్యం గురించి అభిమానులలో ఆందోళన వ్యక్తం అవుతోంది. సర్జరీ తర్వాత అప్డేట్ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇవాళ శివ రాజ్ కుమార్, గీత దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు.
రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ అని వచ్చాయి - గీత
తొలుత అభిమానులు ప్రేక్షకులు అందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పిన గీతా శివ రాజ్ కుమార్... ''మీ అందరి ప్రార్థనల వల్ల రిపోర్టులు అన్ని నెగిటివ్ అని వచ్చాయి. పాథాలజీ రిపోర్ట్ కూడా నెగిటివ్ అని వచ్చింది. ఇప్పుడు మా ఆయన క్యాన్సర్ ఫ్రీ'' అని వివరించారు. శివ రాజ్ కుమార్ కోలుకోవాలని ప్రార్థనలు చేసిన అభిమానులు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.
కిడ్నీ మార్పిడి కాదు... పుకార్లపై క్లారిటీ ఇచ్చిన హీరో
అమెరికాలో కిడ్నీ మార్పిడి చికిత్స కోసం శివ రాజ్ కుమార్ వెళ్లారని ప్రచారం జరిగింది. ఆ పుకార్ల పట్ల ఆయన క్లారిటీ ఇచ్చారు. ''నాకు కిడ్నీ మార్పిడి చికిత్స జరగలేదు. యూరినరీ బ్లాడర్ తీసే చిన్న సర్జరీ జరిగింది. దాని స్థానంలో ఆర్టిఫిషియల్ బ్లాడర్ ఏర్పాటు చేశారు. ఈ విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డాక్టర్లు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మార్చి నుంచి షూటింగులకు హాజరు కావచ్చని చెప్పారు. మరింత శక్తిని కూడా తీసుకొని నేను మళ్ళీ సినిమాలు చేస్తాను. డాన్సులు, ఫైటుల్లో డబుల్ పవర్ చూపిస్తా'' అని చెప్పారు.
కీమోథెరపీ తీసుకుంటూ 45 రోజులు షూటింగ్ చేశా
ఒకవైపు బ్లాడర్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ తీసుకుంటూ తన తదుపరి సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం 45 రోజులు షూటింగ్ చేసినట్లు శివ రాజ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... ''నాకు భయంగా ఉంది, మాట్లాడేటప్పుడు ఎక్కడ ఎమోషనల్ అవుతానో అని! అమెరికా వెళ్లే ముందు కాస్త ఎమోషనల్ అయ్యాను. అభిమానులు, నా తోటి కళాకారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, డాక్టర్లు ధైర్యం చెప్పారు. ఆ ధైర్యం వల్లే నేను నార్మల్ గా ఉన్నాను. షూటింగులు చేశాను. 45 రోజుల పాటు క్లైమాక్స్ షూటింగ్ ఎలా చేశానో నాకే తెలియదు'' అని చెప్పారు. చికిత్స తీసుకునే సమయంలోనే 'భైరతి రణగల్' సినిమా ప్రమోషన్ చేశారు ఆయన.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమా పూజ ఎక్కడ, ఎన్ని గంటలకు జరుగుతుందంటే?
గీత లేకపోతే శివన్న లేడు... భార్యపై ప్రశంసలు
అనారోగ్యానికి గురైన సమయంలో అభిమానుల నుంచి వచ్చిన మద్దతు పట్ల శివ రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తన భార్య గీత గురించి మాట్లాడుతూ... ''నా జీవితంలో గీత లేకపోతే శివన్న లేడు. మరొకరి నుంచి అంత సపోర్ట్ వస్తుందో లేదో? గీత మాత్రం నాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచింది'' అని చెప్పారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న 'పెద్ది' సినిమాతో పాటు కన్నడలో 'ఉత్తరాకాండ', '45', 'భైరవన్న కోనే పాట' సినిమాలలో శివ రాజ్ కుమార్ నటిస్తున్నారు. జనవరి 26 తర్వాత శివన్న ఇండియా రానున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు.
Also Read: మళ్లీ తల్లి కాబోతున్న ఇల్లీ బేబీ... న్యూ ఇయర్ వీడియోలో హింట్ ఇచ్చిన హీరోయిన్