Kiran Jay Kumar Debuts With Jo Jo Movie: దర్శకుడిగా పరిచయమైన 'ప్రస్థానం' నుంచి 'మయసభ' వెబ్ సిరీస్ వరకు... దేవ కట్టా ఆలోచింపజేసే సీరియస్ కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన పంథాకు భిన్నమైన జోనర్ రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ చేశారు. అయితే ఆ సినిమాకు ఆయన దర్శకుడు కాదు... కేవలం సమర్పకులు మాత్రమే.
కిరణ్ జయ్ కుమార్ దర్శకత్వంలో 'జో జో''మయసభ'కు దేవ కట్టా (Deva Katta)తో పాటు దర్శకత్వం వహించిన కిరణ్ జయ్ కుమార్ (Director Kiran Jay Kumar) ఇప్పుడు వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జొన్నగిరిలోని అల్ట్రా రూరల్ డైమండ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ సినిమాకు 'జో జో' టైటిల్ ఖరారు చేశారు. ప్రేమ, జీవితంపై ఆశలు, జీవితంలో పైకి ఎదగాలనే తపన, మెరుగైన జీవితం కోసం మనుషులు ఎంత దూరమైన ప్రయాణించే తీరును సెటైరికల్ కామెడీతో 'జో జో'లో చూపించనున్నారు.
Also Read: Vishal Makutam Review In Telugu - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
ఎండిపోయిన జొన్నగిరి డైమండ్ ఫీల్డ్స్‌లో ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి తమ జీవితాలను మార్చేసే శక్తి ఉన్న వజ్రం కోసం అన్వేషణ మొదలు పెడతారు. ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ తీరిపోతాయని, తమ జీవితాలు మారిపోతాయని ఆశ పడతారు. అయితే వాళ్ళ అన్వేషణ అంత సులభంగా సాగదు. ప్రేమ, వినోదం, అత్యాశ, మోసం, ప్రమాదాలు... ఊహించని పరిణామాలతో ఆ యువతీ యువకుల వజ్రాల అన్వేషణ, ఆ ప్రయాణం గందరగోళంగా మారుతుంది. ఆ నేపథ్యంలో 'జో జో'ను భిన్నమైన నేటివిటీతో రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.
'జో జో' టైటిల్ పోస్టర్ చూస్తే... రా అండ్ ఎర్తీ నేచర్ ఆవిష్కరించేలా జొన్నగిరి ల్యాండ్ స్కేప్ చూపిస్తూ ప్రధాన పాత్రలను హైలైట్ చేశారు. ''హెచ్చరిక: మనోభావాల బ్యాచ్ దూరంగా ఉండండి!'' అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చారు. 'జో జో' చిత్రాన్ని విజయం పతాకంపై విజయ్ కృష్ణ లింగమనేని నిర్మిస్తున్నారు. కిరణ్ జయ్ కుమార్ కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. కృష్ణ కమల్, మాహి శ్రీ, ఫణీంద్ర దేవరపల్లి, ప్రభావతి, మహబూబ్ బాషా, సతీష్ దేవట్టే తంజోర్, పూడూరు శరత్ బాబు, మకరంద్ దేశ్‌పాండే తదితరులు నటించిన ఈ సినిమాకు సమర్పణ: దేవ కట్టా, సినిమాటోగ్రఫీ: రోహిత్ కుమార్, సంగీతం: మహేష్ శంకర్, కూర్పు: మాధవ్ కుమార్ గుళ్ళపల్లి, పాటలు: రెహమాన్ - శ్రీనివాస్ మౌళి - రామచంద్ర.
