సినిమాలు, రాజకీయాలు అనేవి ఎప్పుడూ పక్కపక్కనే ఉంటాయి. అందుకే రాజకీయాల్లో జరిగే చాలా విషయాలపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. వారికి జీతాలు పెంచమని ఉద్యోగులంతా రోడ్డెక్కారు. ఇప్పటికే వారి నిరసనలకు చాలామంది మద్దతు అందించారు. ఇక టాలీవుడ్‌లో పాపులర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా తాజాగా వారి నిరసనలో మద్దతునిస్తూ.. జగన్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో జానీతో పాటు జనసేన కార్యదర్శి కూడా పాల్గొన్నారు. ఈ ఇద్దరు కలిసి జగన్ ప్రభుత్వం పనితీరును విమర్శించారు.
మాట తప్పారు..
ప్రస్తుతం నెల్లూరులో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆ నిరసనలో కార్యకర్తలకు మద్దతునిచ్చి, జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం జానీ ముందుకొచ్చాడు. రామ్ గోపాల్ వర్మకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో.. తనకు కూడా జగన్ అంటే అంతే ఇష్టం అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు జానీ. ఆ తర్వాత అధికారంలోకి రాగానే జీతం పెంచుతామని అంగన్‌వాడీ ఉద్యోగులకు జగన్ ఇచ్చిన మాటను గుర్తుచేశాడు. అప్పుడు అలా మాట ఇచ్చి.. ఇప్పుడు అదే మాట తప్పడం తగదని అన్నాడు. ప్రసవం తర్వాత తన భార్య.. ఇద్దరు పిల్లలతో చాలా ఇబ్బందులు పడిందని, అలాంటిది ఎంతోమంది పిల్లలను ఓపికగా భరిస్తున్న అంగన్‌వాడీ తల్లుల న్యాయమైన కోరికలు తీర్చాలని జగన్ ప్రభుత్వాన్ని కోరాడు జానీ మాస్టర్.
మరణించిన కార్యకర్తకు ఆర్థిక సాయం..
అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తల పోరాటంలో మరణించిన నెల్లూరు జిల్లా సంగం మండలంలోని తరుణవాయి గ్రామానికి చెందిన రమణమ్మకు రూ. 70 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు జానీ మాస్టర్. ఆయన మాట్లాడిన తర్వాత నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కూడా నిరసన గురించి స్పందించారు. తన తల్లికి ముగ్గురు, తన భార్యకు ఇద్దరు బిడ్డలని చెప్పుకొచ్చారు కిషోర్. కానీ అంగన్‌వాడీ తల్లులకు ఎంతోమంది బిడ్డలని అన్నారు. అలాంటి తల్లుల పట్ల దయ లేకుండా వ్యవహరించడం ఏంటి అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మరికొందరు జనసేన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
కొరియోగ్రాఫర్ మాత్రమే కాదు.. హీరో కూడా..
సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా ఉంటూ తాజాగా హీరోగా మారి బిజీ అయిపోయిన జానీ మాస్టర్.. తనే స్వయంగా వచ్చి అంగన్‌వాడీ ఉద్యోగుల నిరసనకు మద్దతునివ్వడం గ్రేట్ అంటే తన ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లో ఎంతోమంది స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించిన జానీ.. ఇటీవల హీరోగా కూడా మారాడు. తను హీరోగా నటించిన మొదటి సినిమా విడుదల అవ్వకముందే మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు. హీరోగా మారిన కూడా డ్యాన్సర్‌గా తన ప్రొఫెషన్‌ను పక్కన పెట్టలేదు జానీ. ఒకవైపు ఆన్ స్క్రీన్ హీరోగా నటిస్తూనే.. మరోవైపు ఆఫ్ స్క్రీన్ కొరియోగ్రాఫర్‌గా బిజీ లైఫ్‌ను గడిపేస్తున్నాడు. అంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు బుల్లితెరపై కూడా కనిపించి అలరిస్తుంటాడు జానీ మాస్టర్.
Also Read: ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ త్యాగం చేసిన శివ కార్తికేయన్, సిద్ధార్థ్