కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అజిత్ కుమార్ ఒక బైక్ రైడర్ అని ఫ్యాన్స్ కు తెలిసిందే. ఆయనకు బైక్స్ అన్నా, బైక్ రైడింగ్ అన్నా అమితమైన ఇష్టం. ఎన్నో ఖరీదైన స్పోర్ట్స్ బైకులు కలిగి ఉన్న నటులలో అజిత్ ఒకరు. బైక్ పై రోడ్ ట్రిప్ కు వెళ్తూ, కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడతాడు. సినిమా షూటింగ్స్ కోసం ఫారిన్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు కూడా బైక్‌ రైడింగ్ లకు వెళ్తుంటాడు. అజిత్ బైక్‌ రైడింగ్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు గతంలో అనేక సందర్భాల్లో నెట్టింట వైరల్ అయ్యాయి. 


గతేడాది ఆగస్ట్ లో అజిత్ కుమార్ వరల్డ్ టూర్ మొదటి దశలో భాగంగా తన బృందంతో కలిసి బైక్ పై భారతదేశంలోని అన్ని రాష్ట్రాలను చుట్టి వచ్చారు. విశాఖపట్నం నుంచి నేరుగా హిమాలయ పర్వత ప్రాంతాల వరకూ రోడ్ ట్రిప్ కు వెళ్ళారు. ఈ టూర్ లో ఆయనతో పాటుగా కోయంబత్తూరుకు చెందిన అన్నాడీఎంకే కౌన్సిలర్‌ సెంథిల్‌, కొందరు స్నేహితులు ఉన్నారు. లడఖ్‌ తో సహా అనేక రాష్ట్రాల నుంచి అజిత్ ఫోటోలు వైరల్ అయ్యాయి. 


అజిత్ కుమార్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ #AK62 ముగించిన తర్వాత ప్రపంచ పర్యటన రెండో దశను ప్రారంభిస్తానని మార్చిలో తన ఫ్యాన్స్ కు తెలియజేశాడు. అయితే అజిత్ తన వరల్డ్ టూర్ ను డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారనే ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీని కోసం అజిత్ తో పాటుగా పాపులర్ సినిమాటోగ్రాఫర్, 'గాడ్ ఫాదర్' ఫేమ్ నీరవ్ షా కూడా ఈ టూర్ లో ఉన్నాడని.. ఎప్పటికప్పుడు స్టార్ హీరో జర్నీని చిత్రీకరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.


బైక్ పై వరల్డ్ టూర్ కు వెళ్లడం అనేది లైఫ్ టైం గోల్ కాబట్టి, ఈ ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా తీసుకురావాలని అజిత్ కుమార్ భావిస్తున్నారట. ఈ క్రమంలో టూర్‌ లోని ప్రతి దశను నీరవ్ షా తన కెమెరాలో బంధిస్తున్నారట. ఇప్పటికే మొదటి దశకు సంబంధించిన అవుట్ పుట్ ను అజిత్ కు అందించారట. ఇదే నిజమైతే, నీరవ్ షా క్యాప్చర్ చేసిన విజువల్స్ ని డాక్యుమెంటరీ ఫార్మెట్‌ లో ఫ్యాన్స్ కి అందిస్తారా? ఏదైనా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ద్వారా స్ట్రీమింగ్ కు పెడతారా? అనేది కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.


అజిత్ కుమార్ తన వ్యక్తిగత జీవితాన్ని షోబిజ్ కు దూరంగా ఉంచడానికి ఇష్టపడతాడు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తప్ప తన పర్సనల్ లైఫ్ గురించిన విషయాలు పంచుకోరు. కాబట్టి తన రోడ్ ట్రిప్ డాక్యుమెంటరీని డిజిటల్‌ గా విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొందరు ఫ్యాన్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం అజిత్ తన బైక్ టూర్‌ విజువల్స్ ని అభిమానుల కోసం ప్రదర్శించాలని కోరుతున్నారు. 


ఇకపోతే టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ హీరోలలో అజిత్ కుమార్ ఒకరు. ఆయన నటించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి, మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన 'తునివు' సినిమాతో అలరించాడు. అజిత్ తదుపరి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ లో చేయనున్నారు. ఈ మూవీ విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేయాల్సి ఉండగా.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం మగిజ్ తిరుమేని డైరెక్షన్ లో AK62 మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అజిత్ బర్త్ డే సందర్భంగా మే 1న ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.