iBOMMA Bappam Websites Closed Developer Immadi Ravi Arrested : ఎన్నో ఏళ్లుగా మూవీ ఇండస్ట్రీని వెంటాడిన పైరసీ భూతం 'iBOMMA' వెబ్ సైట్ మూతపడింది. నిర్వాహకుడు ఇమ్మాడి రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని నుంచి లాగిన్ వివరాలను తెలుసుకుని iBOMMA, Bappam వెబ్ సైట్లను క్లోజ్ చేయించారు. వెబ్ లాగిన్స్‌తో పాటు సర్వర్ లాగిన్ వివరాలను కూడా పూర్తిగా తెలుసుకున్నారు. అంతే కాకుండా కూకట్పల్లిలోని నిందితుని ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించి HD ప్రింట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.

Continues below advertisement

అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల కంటెంట్ నిలిపేశారు. దీంతో ఇండస్ట్రీ పెద్దలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పైరసీ వల్ల ఇండస్ట్రీ ఎంతో నష్టపోయింది. మూవీ రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఫుల్ HD ప్రింట్ iBOMMA వెబ్ సైట్‌లో ప్రత్యక్షం అయ్యేది. దీంతో పాటే పలు బెట్టింగ్ యాప్స్‌ను సైతం రవి ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతన్ని చంచల్ గూడకు తరలించారు. సోమవారం నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్‌ను పోలీసులు దాఖలు చేయనున్నారు.

Also Read : ది వరల్డ్ ఆఫ్ 'వారణాసి' - సృష్టి ఆవిర్భావం To కలియుగం... రామయ్యను ఎత్తుకున్న వానర సైన్యం... అసలు స్టోరీ ఏంటంటే?

Continues below advertisement

భార్యనే పట్టించిందా?

ఈ కేసులో నిందితుడు రవిని ఆయన భార్యే పోలీసులకు పట్టించినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా తన భర్తతో ఆమెకు విభేదాలు ఉన్నాయి. దీని వల్లే రవి గురించి సైబర్ క్రైమ్ అధికారులకు ఆయన భార్య సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. విదేశాల్లో ఉంటూ వెబ్ సైట్ హ్యాండిల్ చేసే రవి... తనను ఎవరూ పట్టుకోలేరనే ధీమాతో హైదరాబాద్‌కు రాగా కూకట్పల్లి పోలీసులు నిఘా వేసి మరీ పట్టుకున్నారు. iBOMMA వంటి పైరసీ సైట్స్ వల్ల సినీ ఇండస్ట్రీతో పాటు ఓటీటీ, థియేటర్లకు తీవ్ర నష్టం కలుగుతుందని... దీన్ని అరికట్టాలని పలువురు నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు.

దీనిపై విచారించిన పోలీసులు అందరి ముఠాను పట్టుకున్నా మెయిన్ నిందితుడిని మాత్రం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా పోలీసులకే సవాల్ విసిరేలా iBOMMA నిర్వాహకుడు కామెంట్స్ చేశారు. అయితే, అలాంటి సవాల్ ఏమీ లేదని గతంలో పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టకేలకు నిందితుడు రవిని పట్టుకుని కటాకటాల్లోకి నెట్టారు. రవి వల్ల ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం వాటిల్లిందని సినీ నిర్మాతలు చెబుతున్నారు. ఈ వెబ్ సైట్లతో బెట్టింగ్, ఇతర యాప్స్ ప్రమోట్ చేసి రవి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నెటిజన్ల సపోర్ట్

అయితే, సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఇమ్మాడి రవికి సపోర్ట్ చేస్తూ మీమ్స్, కామెంట్స్ చేస్తున్నారు. థియేటర్లలో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలు చూడలేని వారు iBOMMAను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. iBOMMA, Bappam ఇక కనిపించకపోవడం బాధాకరమని అంటున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.