Mahesh Babu Foundation Application Details: ఎప్పుడూ ముఖంపై చెరగని చిరునవ్వు... తరగని అందం... తన నటనతో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు. సమాజ సేవలోనూ ఎప్పుడూ ముందుంటూ రియల్ హీరో అనిపించుకున్నారు. వేలాది మంది పేద చిన్నారులకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేసి వారి కుటుంబాల్లో సంతోషం నింపారు.
కేవలం హార్ట్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే, పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, వృద్ధులకు, అభాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తూ వచ్చారు. మహేష్ 50వ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెబుతున్నారు.
ఇలా అప్లై చెయ్యొచ్చు
మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె సమస్యలు ఉన్న పేద చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్స్ చేయిస్తారు. ఇందుకోసం అందరికీ అందుబాటులో ఓ వెబ్ సైట్ తీసుకొచ్చారు. డైరెక్ట్‌గా 'https://www.maheshbabufoundation.org/' సైట్‌లో రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇందులో పూర్తి వివరాలు ఎంటర్ చేస్తే ఆయన టీమే మిమ్మల్ని సంప్రదిస్తుంది. కొద్ది రోజుల క్రితమే మహేష్ బాబు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియాc బయోలో ఈ ఫౌండేషన్ లింక్ షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన్ను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. మహేష్ తమ పాలిట దేవుడని సాయం పొందిన ఎందరో ప్రశంసిస్తున్నారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌ను ఎక్కువ మంది అడిగిన ప్రశ్నలు - సమాధానాలు తెల్సా?
ఫౌండేషన్ వెనుక కథ
మహేష్ బాబు కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడే గుండె సంబంధిత సమస్య ఉండడంతో సర్జరీ చేయించారు. అయితే, ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు తమ చిన్నారులకు డబ్బుల్లేక సర్జరీ చేయించలేకపోతున్నారనే ఆలోచన మహేష్ బాబును కదిలించింది. దీంతో చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్స్ ఫ్రీగా చేయించేలా ఈ ఫౌండేషన్‌ను మహేష్, ఆయన భార్య నమ్రతతో కలిసి 2020లో స్థాపించారు. ఇప్పటివరకూ దాదాపు వేలాది మందికి ఉచితంగా ఆపరేషన్స్ చేయించారు.
30 శాతం సేవా కార్యక్రమాలకు
మహేష్ బాబు తన సంపాదనలో 30 శాతం సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నారు. పిల్లల గుండె ఆపరేషన్స్ కోసం ఏటా రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో 2 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు సైతం చేస్తున్నారు. 2016లో ఏపీలోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి ఆస్పత్రుల నుంచి, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, బాలికలకు గర్భకోశ నివారణ వ్యాక్సిన్లు, పాఠశాలలకు కంప్యూటర్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.
కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్
మహేష్ బాబు తన తండ్రి పేరిట 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్'ను స్టార్ట్ చేశారు. 40 మందికి పైగా పేద విద్యార్థులను సెలక్ట్ చేసి వారికి స్కాలర్షిప్ అందించారు. స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పీజీ వరకూ స్కాలర్షిప్ ఇవ్వనున్నారు. మహేష్ ముద్దుల కూతురు సితార సైతం చారిటీస్‌లో ముందుంటారు. ఆమె ఓ జ్యువెలరీ కంపెనీ యాడ్‌లో నటించగా వచ్చిన ఫస్ట్ రెమ్యునరేషన్ రూ.కోటికి పైగా డబ్బులను వృద్ధుల ఆరోగ్యం, ఆహార అవసరాల కోసం ఇచ్చేసి తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు.