చూస్తుండగానే ఈ ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. 2023 ఫస్టాప్ లో ఇండియన్ బాక్సాఫీసు వద్ద అనేక సినిమాలు సందడి చేశాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు కొన్ని తీవ్రంగా నిరాశ పరిస్తే, మరికొన్ని చిత్రాలు మాత్రం కాసుల వర్షం కురిపించాయి. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.


1. పఠాన్:
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన యాక్షన్ మూవీ "పఠాన్". సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజైంది. ఈ స్పై థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా ₹ 1052.84 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పటికి ఇదే హయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన ఇండియా సినిమా అని చెప్పాలి. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్ గా నటించగా, జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషించాడు. 


2. ఆదిపురుష్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో టీ-సిరీస్ నిర్మించింది. భారీ అంచనాల నడుమ జూన్ 16న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ రెండు వారాల్లో ₹ 407.24 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కానీ మేకర్స్ మాత్రం 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 450 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు. 


3. పొన్నియన్ సెల్వన్-2:
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ప్రసిద్ధ తమిళ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా, చోళుల కథాంశంతో ఈ సినిమాని రూపొందించారు. లైకా ప్రొడక్షన్స్ & మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై నిర్మించారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష కృష్ణన్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'PS 2' సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 347 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. 


4. ది కేరళ స్టోరీ:
అదాశర్మ, సిద్ధి ఇధ్నాని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కేరళలోని హిందూ యువతులను ట్రాప్ చేసి ఇస్లాంలోకి మతమార్పిడి చేయడం, వారిని బలవంతంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం అనేది ఈ సినిమా కథాంశం. ఎన్నో వివాదాలు, విమర్శలు, కోర్టు కేసులు మరియు ఆందోళనల మధ్య మే 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎవరూ ఊహించని విధంగా రూ. 303.97 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


5. వారసుడు:
కోలీవుడ్ స్టార్ విజయ్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'వరిసు'. దీన్ని టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. తెలుగులో సంక్రాంతి కానుకగా జనవరి 11న 'వారసుడు'గా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 303 కోట్లు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. 


Read Also : మెగా మనవరాలికి పేరు పెట్టేశారోచ్ - రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ఏమిటంటే?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial