సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ప్రచార చిత్రాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాట్లాడిన సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. తనకు యాక్సిడెంట్ జరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు.


నాకు ఇది పునర్జన్మ- సాయి ధరమ్ తేజ్


సెప్టెంబర్ 2021లో జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబరు 45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఇసుక ఉండటంతో జారి పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. అపోలో హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స తీసుకున్నాడు. తాజాగా తనకు జరిగిన ప్రమాదం గురించి తలుచుకుంటూ యువతకు ఓ విజ్ఞప్తి చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే కోమాలోకి వెళ్లిపోయినట్లు చెప్పారు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత కూడా సరిగా మాటలు రాలేదని వెల్లడించారు. తాను మరోసారి పునర్జన్మ పొందినట్లుగా ఫీలవుతున్నట్లు తెలిపారు. అంతేకాదు, ఆ ప్రమాదం తనలో బతుకుపై మరిన్ని ఆశలు కలిగించిందన్నారు.  


హెల్మెట్ లేకపోతే బతికేవాడిని కాదు- సాయి ధరమ్ తేజ్


తాను ఈ రోజు బతికి ఉన్ననంటే కారణం హెల్మెట్ అన్నారు. ఆరోజు బైక్ మీద వెళ్లే సమయంలో హెల్మెట్ ధరించి ఉండకపోతే, తాను ఈ రోజు జనాల ముందు నిలబడే వాడిని కాదన్నారు. అందుకే బైక్ నడిపే ప్రతి వ్యక్తి కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. పక్క వీధికి వెళ్లినా కూడా హెల్మెట్ పెట్టుకుని వెళ్లాలన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం మంచిది కాదన్నారు. కష్టం అనిపించినా, తప్పదన్నారు. హెల్మెట్ లేకపోతే, ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాలు చోటు చేసుకుంటాయన్నారు.  


ఏప్రిల్ 21‘విరూపాక్ష’ విడుదల


‘విరూపాక్ష’ సినిమాలో నటి సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరో సాయి ధరమ్ తేజ్  ఈ చిత్రంపై చాలా హోప్స్ తో ఉన్నారు. ఆయన గతంలో నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోవపోవడంతో ఈ మూవీ పైనే ఆశలు పెట్టుకున్నారు.   ఈ చిత్రం ఏప్రిల్ 21, 2023 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.



2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుప్రీం, విన్నర్ సినిమాల ద్వారా తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. యాక్సిడెంట్ సమయంలోనే ఆయన నటించిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదల అయ్యింది. ప్రస్తుతం ‘విరూపాక్ష‘లో నటించారు. సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటాడు. ఇండస్ట్రీలో కూడా తేజ్‌కు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. 


Read Also: నమ్మండి, ఇతడు చియాన్ విక్రమ్ - ‘తంగలన్’ మూవీ మేకింగ్ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు