తెలుగు చిత్రసీమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు అత్యంత సన్నిహితులైన దర్శకులలో ఇద్దరి పేర్లు తప్పకుండా వినిపిస్తాయి. ఒకరు... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). రెండో వ్యక్తి... హరీష్ శంకర్ (Harish Shankar). హీరోగా పవన్ ప్రయాణంలోనూ ఇద్దరూ మెమరబుల్ సినిమాలు 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్' తీశారు. త్రివిక్రమ్‌ను పవన్ ఆప్త మిత్రుడిగా ఇండస్ట్రీ పేర్కొంటే... తనను తాను పవన్ భక్తుడిగా, వీరాభిమానిగా చెప్పుకొంటారు హరీష్. అటువంటి ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ఓ సమయంలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
త్రివిక్రమ్ vs హరీష్... మ్యాటరేంటి?రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు. ఆయన రీ ఎంట్రీ సమయంలో 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'బ్రో' వంటి సినిమాలు చేశారు. అవన్నీ రీమేకులు. అప్పటికి హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనౌన్స్ చేసి ఉన్నారు. హరీష్ మీద కోపం ఉంది కనుక, ఇద్దరికీ పడటం లేదు కనుక రీమేక్ సినిమాలను త్రివిక్రమ్ లైనులోకి తీసుకు వచ్చారని, హరీష్ సినిమాను డిలే చేశారని ప్రచారం జరిగింది. 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ ప్రచారాన్ని త్రివిక్రమ్ కొట్టి పారేశారు.
Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
Harish Shankar On Trivikram: త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో విబేధాలు అంటూ వచ్చిన వార్తలపై హరీష్ శంకర్ స్పందిస్తూ... ''అదేమీ లేదండి. సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌లో 100 వస్తాయి. అది ఇలా ఇది అలా అంటూ! ఒకవేళ ఆయనకు నాకు మధ్య విభేదాలు ఉంటే నేను త్రివిక్రమ్ గారి ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తా? నేను తీసుకు వచ్చాను గనుక మీరు ప్రశ్న అడగలరు. సంధ్య థియేటర్‌లో మొత్తం మీడియా ముందు 'గబ్బర్ సింగ్' మార్నింగ్ షో చూసి... హరీష్ బాగా రాశాడని, బాగా తీశాడని, పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూపించాలని అనుకుంటున్నారో అలా చూపించాడని చెప్పిన మాటలు నాకు ఇవాళ్టికీ గుర్తు ఉన్నాయి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వనప్పుడు ఆయన ఐదు నందులు తీసుకున్న డైలాగ్ రైటర్ ఆయన. ఆయనతో నాకు గొడవ ఏముంటుంది? నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వక ముందు ఆయన డైరెక్టర్. అంతకు ముందు రచయితగా పాపులర్. నేను ఆయన్ను అగ్రజా (అన్నయ్య) అని పిలుస్తా. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ చూసి మెసేజ్ చేశారు. మేం గంట సేపు మాట్లాడుకున్నాం'' అని చెప్పారు.
త్రివిక్రమ్ అంటే తనకు గౌరవం అని, తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. అన్నట్టు... హరీష్ శంకర్ దగ్గర ఇప్పుడు రెండు అడ్వాన్సులు ఉన్నాయి. ఒకటి... కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థది. రెండోది... త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య, సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్న సినిమాది. అందులో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తారని తెలిసింది.
